కేటీఆర్ ఎన్నిక చెల్లదని రెండు పిటిషన్లు
కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్, ఈసీలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూన్ 14, (విజయక్రాంతి): సిరిసిల్ల అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికైన కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన రెండు వేర్వేరు వ్యాజ్యాలను విచారించింది. ప్రతివాదులైన కేటీఆర్, కేంద్రఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి, రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఆర్డీవోలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో వాస్తవాలను దాచిపెట్టారని, మేజర్ అయిన కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు పేరిట ఆస్తులు ఎలా వచ్చాయో వివరించలేదంటూ ఆయనపై కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి వేర్వేరుగా ఎలక్షన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎలక్షన్ అఫిడవిట్లో మైనర్ కుమార్తె, భార్య మాత్రమే తనపై ఆధారపడ్డారని, 2023 జూలైలో మేజర్ అయిన కుమారుడు కే హిమాన్షు తనపై ఆధారపడలేదని పేర్కొన్నారని వారు తమ పిటిషన్లల్లో వివరించారు.
హిమాన్షు సిద్దిపేట మర్కూక్ మండలం ఎస్.వెంకటాపూర్‌లో 4 ఎకరాలు, ఎర్రబల్లిలో 32 ఎకరాలు కొనుగోలు చేశారని, ఇందు కోసం రూ 10.50 లక్షలు, రూ.88 15 లక్షలు చెల్లించారని.. తండ్రి కేటీఆర్ నుంచి ఆర్థిక సాయం లేకుండా అంత మొత్తాన్ని హిమాన్హు ఎలా చెల్లించారనే సందేహాన్ని లేవనెత్తారు. ఎన్నికల అఫిడవిట్లో వాస్తవాలను దాచిపెట్టారని, ఇలా చేయడం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123కు విరుద్ధమన్నారు.
అంతేకాకుండా సుప్రీంకోర్టు, రుక్మిణి మాదగౌడ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో వెలువరించిన తీర్పుకు వ్యతిరేకమన్నారు. పిటిషనర్ల వాదనల తర్వాత హైకోర్టు, ప్రతివాదులుగా ఉన్న కేటీఆర్, ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈలోగా ప్రతివాదులు తమ వాదనలతో కూడిన కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది.






