31 March, 2026 | 10:33 AM

కోడ్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు

18-02-2025 12:52 AM

సత్వర జారీకి ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) : రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయా లని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతోపాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరి శీలించే ప్రక్రియను వేగంగా పూర్తిచే యాలని సీఎం ఆదేశించారు.

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే నని సీఎం స్పష్టంచేశారు. సోమవారం పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సంబంధిత శాఖపై సీఎం సమీక్షించారు.

కోడ్ అమల్లోలేని జిల్లాల్లో వెంటనే..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎన్నికల కోడ్ అమల్లోలేని జిల్లాల్లో ముందుగా రేషన్ కార్డులను జారీచేయాలని సీఎం స్పష్టంగా చెప్పారు. కోడ్ ముగిసిన తరువాత అన్ని జిల్లాల్లో కొత్త రేషను కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు సూచించారు.

కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారుచేసిన పలు డిజైన్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పరిశీలించారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినప్పటికీ.. మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డులకు ఎందుకు రద్దీ ఉంటున్నదని సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు.

దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాయని.. అందుకే రద్దీ ఉంటున్నదని అధికారు లు సీఎంకు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డు లు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త కార్డులు జారీచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్ళీ మళ్ళీ దరఖాస్తులు చేయకుండాఅవగాహన కల్పించాలన్నారు,.