ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్
భారీ వాహనాలపై మల్కాజిగిరి పోలీసుల ఉక్కుపాదం!
మేడ్చల్/సికింద్రాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): నగరంలో నానాటికీ పెరిగిపోతు న్న ట్రాఫిక్ రద్దీకి అడ్డుకట్ట వేయడంతో పాటు పాదచారుల భద్రతే లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. కమిషనరేట్ పరిధిలోని ప్రధాన రహదారులపై భారీ, మధ్యతరహా మోటారు వాహనాల రాకపోకలపై కఠిన ఆంక్షలు విధిస్తూ కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పీక్ అవర్స్‌లో భారీ వాహనాలు రోడ్లపైకి రాకుండా పోలీసులు సమయాలను కేటాయించారు. నిషేధిత సమయాలు: ఉదయం 7:30 నుంచి 11:30 వరకు, తిరిగి సాయంత్రం 3:30 నుంచి రాత్రి 10:30 వరకు భారీ వాహనాలను అనుమతించరు. అనుమతించే సమయాలు: మధ్యాహ్నం 11:30 నుంచి 3:30 వరకు మరియు రాత్రి 10:30 నుంచి మరుసటి రోజు ఉదయం 7:30 వరకు మాత్రమే ఈ వాహనాలు తిరగవచ్చు.
డీసీఎంలు, ఐషర్ వ్యాన్లు, వాటర్ ట్యాంకర్లు, రెడీ మిక్స్ కాంక్రీట్ వాహనాలు, రాకెట్ లారీలు, జేసీబీలు, ట్రాక్టర్లు మరియు ప్రైవేట్ బస్సులపై ఈ పరిమితులు వర్తిస్తాయి. అయితే, టీస్ ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు, అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షల నుండి పూర్తి మినహాయింపునిచ్చారు.
కొన్ని కీలకమైన ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు గాను, సరుకు రవాణా వాహనాలు, 10 సీట్ల కంటే ఎక్కువ సామర్థ్యం గల ప్రయాణీకుల వాహనాలపై రౌండ్ ద క్లాక్ (24 గంటలు) నిషేధం విధించారు. పీఎన్టీ ఫ్లైఓవర్, సీటీఓ ఫ్లైఓవర్, వైఎమ్ సీఏ ఫ్లైఓవర్, బైరామల్గూడ 1వ, 2వ లెవల్ ఫ్లై ఓవర్లపై భారీ వాహనాలకు అనుమతి లేదు.
ఈ ప్రాంతాల్లో ఆంక్షలు
అల్వాల్, తిరుమలగిరి, బేగంపేట, గోపాలపురం, మల్కాజిగిరి, నేరెడ్మెట్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, ఉప్పల్ కుషాయిగూడ పరిధిలోని అన్ని ప్రధాన రహదారులపై ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో నిషేధిత సమయాల్లో వాహనాలను నడపాల్సిన వారు మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ నుండి ముందస్తు రాతపూర్వక అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచిం చారు. నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.




