19 May, 2026 | 12:23 PM

తదుపరి టార్గెట్..!?

25-08-2024 03:10 AM

దూకుడు పెంచిన హైడ్రా 

భూ ఆక్రమణదారుల వెన్నులో వణుకు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరు చెప్పినా, విన్నా ఆక్రమణదారుల వెన్నులో వణుకు పుడుతోంది. ప్రభుత్వ స్థలాలను, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతోన్నాయి. శనివారం ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన నేపథ్యంలో తదుపరి టార్గెట్ ఎవరు? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

శనివారం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు జరుగుతుండగానే మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్‌లోని సర్వే నంబరు 813లో నాడెం చెరువు బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్శిటీ, నీలిమా ఆసుపత్రిని అక్రమంగా నిర్మించినట్టుగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఇప్పటికే భూఆక్రమణల అంశం వివాదస్పదంగా మారి పోలీస్ స్టేషేన్‌లోనూ ఫిర్యాదుల వరకూ చేరింది. వీరితో పాటు పలు ప్రాంతాల్లోని చెరువులను ఆక్రమణలు చేసిన పలువురి ప్రముఖులపై కూడా హైడ్రాకు ఫిర్యాదులు అందే అవకాశం కన్పిస్తున్నది. హైడ్రా కు అందుతున్న ఫిర్యాదుల పట్ల అధికారులు కొంత గోప్యతను పాటిస్తున్నారు. దీంతో అధికారులను సీన్‌లోనే చూడాల్సి వస్తుంది.  

ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా..

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టార్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) సంస్థ స్థానంలో హైదరాబాద్ డిజాస్టార్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైడ్రా పేరు ఖరారు కాకముందే సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఈవీడీఎం కమిషనర్‌గా జూన్ 24న బాధ్యతలు చేపట్టారు. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జూలై 19న జీవో  విడుదల చేసింది. ఏర్పాటైన 35 రోజుల వ్యవధిలోనే హైడ్రా అక్రమార్కులకు చెమటలు పట్టించింది.

ఈ నెల 6న గాజుల రామారాం సమీపంలోని చింతల చెరువులో నిర్మించిన 52 ఇళ్లను కూల్చివేశారు. 7న నందగిరిహిల్స్ కాలనీలోని పార్కు స్థలాన్ని కబ్జా చేసి ఏర్పాటుచేసుకున్న గుడిసెలను తొలగించారు. వీటిపై అధికార పక్ష ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయినా, కమిషనర్ అవేమీ లెక్కచేయ కుండానే తన దూకుడు మరింత పెంచారు.

హైడ్రా పేరుతో జీవో వచ్చిన రోజునే చెరువుల పరిరక్షణపై వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం విశేషం. అదే రోజు ఎల్బీ నగర్ సమీపంలోని ఫతుల్లాగూడ చెరువును సందర్శించారు.

ఈ క్రమంలోనే అమీన్‌పూర్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ పలు చెరువులను ఏవీ రంగనాథ్ స్వయం గా పర్యవేక్షణ చేసి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేయాలని స్థానికులకు సూచించారు. ఈ నెల 9న రాజేంద్రనగర్ ప్రాంతంలోని బూమ్ రుఖా ఉద్ దవాళ్ చెరువులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ సమయంలో ఓ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. అవేమీ పట్టించుకోకుండా నిరసనకారులను అరెస్టు చేయించి ఆక్రమణలను కూల్చివేశారు.