19 May, 2026 | 1:47 PM

ఇన్నాళ్లు మీనమేషాలు ఎందుకు?

25-08-2024 03:30 AM
  1. అక్రమ నిర్మాణాలను బరాబర్ కూలగొట్టాల్సిందే
  2. ఎన్ కన్వెన్షన్‌పై గతంలోని తీర్పును పరిశీలించండి
  3. చెరువుల పరిరక్షణకు న్యాయమూర్తులు సహకరించాలి
  4. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టాలని 2014 లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి బీఆర్‌ఎస్ ఎందుకు మీనమేషాలు లెక్కపెట్టిందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. పదేళ్లు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఎందుకు తొలగించలేదని నిలదీశారు. చేనేతకు సినీ నటుడు నాగార్జున కోడలిని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టడం వెకున్న మతలబు ఏంటని అడిగారు.

2014 నుంచి ఎన్ కన్వెన్షన్‌పై వచ్చిన ఆదాయాన్ని నాగార్జున నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చాలని 2010లోనే హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో 1994లోనే మీరాలం చెరువు అక్రమ నిర్మాణాలను తొలగించారని గుర్తుచేశారు. మీరాలం ట్యాంక్ ప్రస్తుతం పూర్తిగా ఆక్రమణలకు గురైందన్నారు. అక్కడ ఎంఐఎం నేతలకు భయపడి హైడ్రా వెనక్కి తగ్గిందని విమర్శించారు. ఆంధ్రోళ్లు అనేక కబ్జాలు చేశారని, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి భయపడకుండా తన జేసీబీలతో మీరాలం ట్యాంక్ దగ్గరికి రావాలని సూచించారు. 

చెరువుల ఆక్రమణలపై శ్వేత పత్రం విడుదల చేయాలి 

బీఆర్‌ఎస్, ఇప్పటి కాంగ్రెస్ హయాంలో చెరువుల ఆక్రమణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. కోర్టు ఎన్ కన్వెన్షన్ మీద స్టే ఎలా ఇస్తుందని అన్నారు. అక్రమ నిర్మాణాన్ని బరాబర్ కూలగొట్టాల్సిందేనని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ మీద గతంలో తీర్పు ఇచ్చిన జడ్జిమెంట్ చూడాలని కోరారు. మీరు స్టే ఇస్తున్నారంటే గతంలో జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిలను అవమానిస్తున్నారా? అని అన్నారు. ఎవరిని గౌరవించేందుకు స్టే ఇచ్చారని రఘునందన్ ప్రశ్నించారు.

ఇది కరెక్ట్ కాదని, ఏ అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేసే అధికారం పంచాయతీ కార్యదర్శులకు ఉందని చెప్పారు. 2007, 2008లో చెరువులను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని, చెరువులో కడితే నోటిసులు ఇవ్వకుండా కూల్చాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తుచేశారు. మళ్ళీ జడ్జీలు స్టే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు హైకోర్టు జడ్జిలు సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు.

111 జీవో పరిధిలో హరీశ్, కవిత, కేటీఆర్ ఆస్తులు 

111 జీవో పరిధిలో హరీశ్‌రావు, కవిత, కేటీఆర్‌కు ఆస్తులు లేవా? బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఇండ్లు లేవా? అని రఘునందన్ ప్రశ్నించారు. వీరి ఇండ్లనూ కూలగొట్టాలని డిమాండ్ చేశారు. జన్వాడ ఫాంహౌస్ కూల్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డికి భయమెందుకన్నారు. జన్వాడ ఫాం హౌస్ ఇల్లీగల్ అని ఆ రోజు రేవంత్‌రెడ్డి అన్నారని, నేడు ఎందుకు కూలగొట్టడం లేదని అడిగారు. కండువాలు మార్చమని బెదిరించేందుకే కూల్చివేతలని ఆరోపించారు.

ఈ ప్రభుత్వం చెరువుల వద్ద సీసీ కెమెరాల కోసం రూ.480 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లు గుర్తించడానికి మీకెంత సమ యం కావాలని ప్రశ్నించారు. రేవంత్, హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు గుర్తించిన 2500 చెరువులను కాపాడాలని డిమాండ్‌చేశారు. రాజ్ భవన్ రోడ్డులో నాలాపై బంగ్లాలు కట్టడం బాధాకరమని అన్నారు. కేటీఆర్ హయాంలో కట్టిన అక్రమ నిర్మాణాలను తనే బాధ్యత వహిస్తూ ముక్కు నేలకు రాయాలన్నారు.