18 April, 2026 | 6:23 PM

ఎన్ఐఏ నోటీసులు భావ ప్రకటనకు సంకెళ్లు

18-04-2026 05:03 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): జాతీయ దర్యాప్తు సంస్థ ఉపా కేసులో సీపీఐ (ఎంఎల్-మాస్ లైన్) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు కు నోటీసు జారీ చేయడం బావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమేనని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రవి, జిల్లా సహాయ కార్యదర్శి కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది హక్కుల కార్యకర్తలు, కవులు,కళాకారులు,ఉద్యమ నాయకులకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేస్తూ నిర్బంధ వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు. పౌర  హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఉద్యోగుల సంఘం మాజీ నాయకులు దేవీ ప్రసాద్, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత నందినీ సిద్ధారెడ్డి వంటి ప్రముఖులకు కూడా నోటీసులు అందడం దారుణమన్నారు.

దర్యాప్తు పేరుతో వ్యవహరిస్తున్న ఈ తీరు చట్టబద్ధ పాలనకు విరుద్ధమన్నారు. రాజకీయ స్వేచ్ఛని హరిస్తూ నిరసనలేని పాలనను కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందని ఆరోపించారు. ఎన్ ఐ ఏ పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. బొంబాయి పేలుళ్లు సందర్భంగా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధం కోసం ఏర్పడ్డ జాతీయ దర్యాప్తు సంస్థను దేశంలో వామపక్ష భావజాలం నిరోధానికి కేంద్రం దుర్వినియోగపరుస్తుందని విమర్శించారు.రంగారావుతోపాటు ఇతరులకు అందజేసిన నోటీసులను ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు.