05-10-2025 12:45:41 AM
లండన్/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను రూ.14,000 కోట్ల మేర మోసగించి యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే పిటిషన్‌పై నవంబర్ 23న అక్కడి వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరగనున్నది. దీం తో ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని, విచారణ జరిగిన రోజే యూకే ప్రభుత్వం నీరవ్‌ను అప్పగిస్తుందని భారత ప్రభుత్వం భావిస్తున్నది.
తనను భారత్‌కు అప్పగిస్తే దర్యాప్తు సంస్థలు విచారణ పేరుతో హింసించే అవకాశం ఉందని నీరవ్ మోదీ గతంలో కోర్టు లో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కేసులో ఛార్జిషీట్లు దాఖలు చేశాయని, కాబట్టి విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. నీరవ్ మోదీకి అనుకూలమైన తీర్పు రాకుండా ఉండేందుకు బ్రిటన్ ప్రభుత్వానికి ఇటీవల లిఖిత పూర్వక హామీ సమర్పించింది.
నిందితుడిని ముంబై నగరంలోని ఆర్థర్ రోడ్ జైలు ఉంచుతామని, బ్యా రక్ నంబర్12 కేటాయిస్తామని తెలిపింది. జైలులో ఆయనకు సరైన వైద్య సదుపాయా లు కల్పిస్తామని స్పష్టం చేసింది. ఆయన్ను మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని, ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. నిందితుడిని కేవలం న్యాయస్థానం ఎదుట మాత్రమే విచారణ కోసం హాజరు పరుస్తామని స్పష్టం చేసింది.
ఈ హామీతో నీరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మొదటి విచారణలోనే కొట్టివేస్తుందని భారత యంత్రాంగం అంచనా వేస్తున్నది. ఇటీవల భారత్‌లోని జైళ్లలో సౌకర్యాలను అంచనా వేసేందుకు బ్రిటన్‌కు చెందిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) అధికారులు ఇటీవల భారత్‌కు వచ్చి, దేశంలోని అనేక జైళ్లను సందర్శించడం గమనార్హం. నీరవ్ మోదీ 2019 మా ర్చి నుంచి లండన్‌లోని జైలులో ఉన్నారు. తనతో పాటు తన బంధువు మెహుల్ చోక్సీ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేశారని ఆరోపణలు ఎందుర్కొంటున్నారు.
కేసు పూర్వాపరాలు..
తప్పుడు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్(ఎల్‌వోయూ)తో నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.14,000 కోట్ల మేర మోసగించాడని 2018 జనవరిలో ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంపై ఎన్‌ఫో ర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెం ట్రల్ బ్యూ రో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు ప్రారంభించాయి. ఈక్రమంలో నీరవ్ మోదీ దేశం విడిచి యూకే పారిపోయాడు. ఈడీ దీంతో నిందితుడిని పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది.
నీరవ్ తమ దేశంలోనే నివసిస్తున్నాడని 2018 డిసెంబర్‌లో బ్రిటన్ ప్రభు త్వం ప్రకటించింది. దీంతో నిందితుడిని తమకు అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చే సింది. 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పో లీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అతడిని భారత్‌కు అప్పగిం చేందుకు 2021లో అప్పటి బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని సవాల్ చేస్తూ నీరవ్ లండన్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిం చింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ భంగపాటుకే గురయ్యాడు.