25 August, 2026 | 6:03 PM

నిషాంత్‌కు పారిస్ టికెట్

01-06-2024 12:24 AM

బ్యాంకాక్: భారత బాక్సర్ నిషాంత్ దేవ్ ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫయర్స్ టోర్నీలో పురుషుల 71 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరిన నిషాంత్ పారిస్ టికెట్ అందుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిషాంత్ 5 వాసిలే సెబోటరీ (మల్డోవా)ను చిత్తుగా ఓడించాడు. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన నిషాంత్ తొలి రౌండ్  నుంచి ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించాడు.

జాబ్స్, హుక్స్‌తో సెబోటరీపై విరుచుకుపడిన నిషాంత్ రెండో రౌండ్‌లో కాస్త వెనుకబడినప్పటికీ వెంటనే ఫుంజుకున్నాడు. ఆఖరి మూడు నిమిషాల్లో నిషాంత్ తన పంచుల్లో మరింత వేగం పెంచడంతో సెబోటరీ వద్ద సమాధానం లేకుండా పోయింది. దీంతో జడ్జీలు నిషాంత్‌ను విజేతగా ప్రకటించారు. అంతకముందు మహిళల 60 కేజీల విభాగంలో అంకుషితా బోరో క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో చివరి వరకు పోరాడినప్పటికి అంకుషితా 2 అగ్నెస్ అలెక్సూసన్ (స్వీడన్) చేతిలో ఓటమి పాలైంది. భారత్ నుంచి ఒలింపిక్ కోటా సాధించిన నాలుగో బాక్సర్‌గా నిషాంత్ నిలిచాడు.

ఇంతకముందు మహిళల విభాగంలో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతీ పవార్ (54 కేజీలు), లవ్లీనా బొర్గొహై (75 కేజీలు) విశ్వక్రీడలకు అర్హత సాధించారు. 51 కేజీల విభాగంలో అమిత్ పంగల్, 57 కేజీల విభాగంలో సచిన్ సివాచ్‌లు ఒలింపిక్ కోటా సాధించేందుకు అడుగు దూరంలో నిలిచారు. మహిళల 66 కేజీల విభాగంలో అరుంధతీ చౌదరీ నిరాశపరిచింది.