2 July, 2026 | 12:12 AM

ఆ మూడింటితో ముప్పే!

01-06-2024 12:20 AM

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ టీ20 లీగ్ జరిగినా అందులో ప్రధాన ఆకర్షణగా నిలిచే కరీబియన్లు.. ఈసారి సొంతగడ్డపై వరల్డ్ కప్ ట్రోఫీ ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని పట్టుదలతో ఉన్నారు. నిరుడు ఐసీసీ వన్డే ప్రపంచకప్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్స్ నెగ్గిన ఆస్ట్రేలియా.. పొట్టి కప్పును కూడా ఖాతాలో వేసుకుంటే ఓ పనైపోతుందని భావిస్తోంది! ఇక బాదుడే పరమావధిగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కొత్త అర్థం చెబుతున్న ఇంగ్లండ్ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలని చూస్తోంది. రేపటి నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మూడు జట్ల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే..

ఇంగ్లిష్ జట్టుకు అడ్డుందా!

ఒకప్పుడు సంప్రదాయ ఆటతీరుకు మారు పేరుగా నిలిచిన ఇంగ్లండ్ జట్టు ఇటీవలి కాలంలో.. పూర్తిగా మారిపోయింది. గతంలో ఎర్రబంతికే అధిక ప్రాధాన్యమిచ్చి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోని ఇంగ్లిష్ క్రికెటర్లు ఇప్పుడు ధనాధన్ ఆటతో మెప్పిస్తున్నారు. వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా కేవలం బాదడమే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. మెగాటోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఇంగ్లండ్ జట్టు.. మూడో సారి విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. తాజా ఐపీఎల్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు దుమ్మురేపిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో బట్లర్, కోల్‌కతా చాంపియన్‌గా నిలవడంలో సాల్ట్ పాత్ర ఎంత ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బెయిర్‌స్టో, మోయిన్ అలీ, బ్రూక్, సామ్ కన్, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్ కూడా వీరికి జత కూడితే ఇంగ్లండ్‌కు పట్టపగ్గాలు లేనట్లే!

కీలక ఆటగాళ్లు: బట్లర్, బెయిర్‌స్టో, మోయిన్ అలీ, బ్రూక్, లివింగ్‌స్టోన్, సాల్ట్, కరన్.అత్యుత్తమ ప్రదర్శన: 2010, 2022 చాంపియన్స్

జాతీయ జట్టు కంటే లీగ్‌లు ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వెస్టిండీస్ ప్లేయర్లు.. ఎవరికి వారే యమునా తీరే అన్నది జగమెరిగిన సత్యం. బోర్డు ఆర్థిక ఇబ్బందులు, మేనేజ్‌మెంట్‌తో పొసగకపోవడంతో స్టార్ ప్లేయర్లెందరూ కరీబియన్ జట్టుకు ఆడటమే మానేశారు. అయినా పొట్టి ఫార్మాట్ అంటే చాలు కరీబియన్లు రెచ్చిపోతారు. ఐపీఎల్, పీఎస్‌ఎల్, బీపీఎల్, ఎస్‌సీఎల్ ఇలా ఏ లీగ్‌ను తీసుకున్నా.. ఫ్రాంచైజీలన్నీ వెస్టిండీస్ ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఉత్సాహం చూపుతాయి. అందుకు తగ్గట్లే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ కరీబియన్లు అద్భుతాలు చేసి చూపుతారు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌నే తీసుకుంటే.. చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రస్సెల్, నరైన్ తెచ్చిన విలువ అంతాఇంతా కాదు. తుదిపోరులో రస్సెల్ ఫీల్డింగ్ విన్యాసాలు చూసిన వారెవరైనా ఆశ్చర్యపోక మానరు. దూకుడుకు మారు పేరైన విండీస్ ఆటగాళ్లు.. పిచ్, పరిస్థితులు, ప్రత్యర్థులు ఇలా.. ఏ అంశాన్ని పట్టించుకోకుండా చెలరేగిపోతుంటారు. చివరి స్థానంలో బ్యాటింగ్ వచ్చే ప్లేయర్ సైతం ధాటిగా సిక్సులు బాదడం కేవలం కరీబియన్లకే సాధ్యం. అయితే లీగ్‌ల్లో బాగా ఆరితేరిన విండీస్ ప్లేయర్లు సమష్టిగా ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది కీలకం. తాజాగా ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో కంగారూలపై భారీ స్కోరు చేసిన కరీబియన్లు.. మెగాటోర్నీ ఆరంభానికి ముందే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వరల్డ్‌కప్‌లో విండీస్ జట్టుకు రావ్‌మన్ పావెల్ సారథ్యం వహిస్తుండగా.. హెట్‌మైర్, హోప్, కింగ్, జోసెఫ్, స్సెల్, షెఫర్డ్‌తో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రెండుసార్లు (2012, 2016లో) ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కరీబియన్లు ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టాలని కసితో ఉన్నారు.

కీలక ఆటగాళ్లు: పావెల్, రస్సెల్, హెట్‌మైర్, హోప్, పూరన్, చేజ్.అత్యుత్తమ ప్రదర్శన: 2012, 2016 చాంపియన్స్

‘అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే ఏ టోర్నీలోనైనా ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం అత్యంత కష్టమైన పని’ ఇది క్రీడా విశ్లేషకుల ఉవాచ. ద్వైపాక్షిక సిరీస్‌లు, ముక్కోణపు టోర్నీల్లో ఎలాంటి ప్రదర్శన కనబర్చినా.. ప్రపంచకప్ అనేసరికి ఆస్ట్రేలియా అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తుంది. వేరే లెవల్ ఆటతీరుతో ఐసీసీ ట్రోఫీలను ఒడిసిపట్టడం.. కంగారూలకు తెలిసినంత బాగా మరే జట్టుకు తెలయదనేది ఒప్పుకోక తప్పని నిజం. పుష్కర కాలంగా అన్నీ ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న భారత జట్టు.. ఐసీసీ ట్రోఫీకి దూరంగా ఉండిపోవడానికి ప్రధాన కారణం కూడా ఆసీస్ అనడంలో అతిశయోక్తి లేదు. నిరుడు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌తో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) గెలిచి మంచి జోరు మీదున్న ఆసీస్.. పొట్టి ప్రపంచకప్‌లోనూ అదే జోష్ కొనసాగించాలని చూస్తోంది. ప్రధాన ఆటగాళ్లు మంచి లయలో ఉండటం ఆ జట్టుకు కలిసి రానుంది. మెగాటోర్నీలో కంగారూల సైన్యానికి మిషెల్ మార్ష్ నాయకత్వం వహిస్తుండగా.. ఇటీవల ఐపీఎల్లో దుమ్మురేపిన కమిన్స్, హెడ్, గ్రీన్, స్టార్క్, స్టొయినిస్, వార్నర్ కీలకం కానున్నారు. బెంగళూరు తరఫున పెద్దగా ప్రభావం చూపలేకపోయిన మ్యాక్స్‌వెల్, మాథ్యూవేడ్, టీమ్ డేవిడ్ కూడా లయ అందుకుంటే ఆసీస్ ఆపడం అసాధ్యమే. 2021లో ట్రోఫీ గెలిచిన కంగారూలు రెండో కప్పు కోసం కసరత్తు చేస్తున్నారు.

కీలక ఆటగాళ్లు: మార్ష్, హెడ్, మ్యాక్స్‌వెల్, వార్నర్, గ్రీన్, కమిన్స్, స్టార్క్. అత్యుత్తమ ప్రదర్శన: 2021 చాంపియన్స్