calender_icon.png 16 December, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

15-12-2025 01:20:30 AM

  1. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియామకం

ఖరారు చేసిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు

ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

ప్రస్తుతం బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఆయన బాధ్యతలు

శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబీన్‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.  ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.ఇందుకు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు ‘బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబీబ్‌ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది’ అని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.ప్రస్తుతం నితిన్ నబీన్ బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఈ నియామకం ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.ఇప్పటివరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జేపీ నడ్డా కొనసాగిన సంగతి తెలిసిందే.2020 జనవరిలో నడ్డా బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలం పూర్తి అయినా 2004 లోక్‌సభ ఎన్నికలతో సహా పలు కీలక ఎన్నికల సందర్భాలను పురస్కరించుకుని జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది.

నమ్మకమైన కార్యకర్తగా..

బీహార్ రాష్ట్రానికి చెందిన నితిన్ నబిన్ పాట్నాలో జన్మించాడు. నబిన్ తండ్రి నబిన్ కిశోర్ ప్రసాద్ సిన్హా బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగారు. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడ. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని నితిన్ నబిన్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.నితిన్ నబిన్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ అధిష్ఠానం దృష్టిలో పడ్డారు.

తన తండ్రి చనిపోయిన తర్వాత 2006లో పాట్నా వెస్ట్ నియోజకవర్గానికి జరిగిన నితిన్ నబిన్ ఉపఎన్నికలో తొలిసారిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత బంకీపుర్ నుంచి వరుసగా నాలుగుసార్లు - 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో, నటుడు శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలిచి జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించారు.

ఇటీవల ముగిసిన 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం నబిన్ తన సమీప ప్రత్యర్థిపై 51,000 ఓట్లకు పైగా భారీ ఆధిక్యంతో మరోసారి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఒక అనుభవజ్ఞుడైన నేతగా, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర స్థాయిలో బలమైన నేతగా, ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన వ్యక్తిగా నితిన్ నబిన్‌కు మంచి పేరుంది. ఇప్పుడు జాతీయ వర్కింగ్ అధ్యక్షుడిగా నియమితుడు కావడంతో, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధాని మోదీ శుభాకాంక్షలు

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నితిన్ నబిన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ’నితిన్ నబిన్‌ను కష్టపడి పనిచేసే కార్యకర్తగా, యువ నాయకుడిగా పేర్కొన్నారు. ఆయనకు సంస్థాగతంగా అపారమైన అనుభవం ఉంది. బీహార్‌లో పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన రికార్డు ఆకట్టుకుంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన ఎంతో శ్రద్ధగా పనిచేశారు’ అని కొనియాడారు.