15-12-2025 01:40:46 AM
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు
సూర్యాపేట, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : జిల్లాలో గ్రామపంచాయతీకి జరుగుతున్న రెండో విడత ఎన్నికలు ఆదివారం సజావుగా సాగాయి. జిల్లాలోని చివ్వెంల, పెన్ పహాడ్, కోదాడ, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు ఎనిమిది మండలాల్లో 181 గ్రామపంచాయతీలకు గాను 23 ఏకగ్రీవం కాగా మిగిలిన 158 గ్రామ గ్రామపంచాయతీలో 1287 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.
ఇందులో మొత్తం 2,35,137 మంది ఓటర్లు ఉండగా 1901 మంది పీ ఓలు, 2,429 ఓపీఓలు, 175 మంది స్టేజ్ 2 ఆఫీసర్ లు, 60 మంది రూట్ ఆఫీసర్ లు, 61 మంది మైక్రో అబ్జర్వర్స్ లు విధులు నిర్వహించగా జిల్లాలోని 25 సమస్యాత్మక గ్రామాలలో వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ కొద్దిసేపు మందకొడిగా సాగగా తదుపరి వేగం పుంజుకుంది. చివరి గంటలో చాలా పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తక్కువగా కనిపించారు. కాగా మోతె మండలం నామవరం గ్రామంలో ఎన్నికల సరళిని పరిశీలించారు.
అదేవిధంగా చివ్వెంల మండలంలోని పలు కేంద్రాలను సైతం పరిశీలించారు. అలాగే అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా, లక్కవరం లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎస్పీ నర్సింహా కోదాడ మండలం గణపవరం, బీక్యతండాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
మొత్తంగా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో 89.55 శాతం పోలింగ్. జిల్లాలోనీ 8 మండలాల్లో 2,35,137 మంది ఓటర్ లకు గాను 2,10,576 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా పోలింగ్ 89.55 శాతంగా నమోదైంది. ఇందులో అనంతగిరి 91.02, చిలుకూరు 88.99 చివ్వెంల 91.99, కోదాడ 89.04, , మోతే 88.90, మునగాల 88.78, నడిగూడెం 89.20 పెన్ పహాడ్ 90.95 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
కోదాడ (అనంతగిరి) డిసెంబర్ 14 ః కౌంటింగ్ కు ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. అనంతగిరి మండలం బొజ్జ గూడెం తండా, లక్కవరం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని, కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
మధ్యాహ్నం 1:00 గంటలలోపు పోలింగ్ కేంద్ర ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్కరికి టోకెన్లు జారీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించాలని, మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని, కౌంటింగ్ కు ఇబ్బంది లేకుండా రెండు టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలని కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రాఫి చేయించాలని అలాగే కౌంటింగ్ కేంద్రంలోకి ఎటువంటి సెల్ ఫోన్స్ అనుమతించకూడదని ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
బొజ్జ గూడెం తండా గ్రామపంచాయతీలోని 8 వార్డు లలో 1215 ఓట్లు ఉన్నాయని మధ్యాహ్నం 12:30 గంటల వరకు 91 శాతం, లక్కవరం గ్రామపంచాయతీలోని 8 వార్డు లలో 972 ఓట్లు ఉన్నాయని మధ్యాహ్నం 12:40 గంటల వరకు 92.00 శాతం పోలింగ్ పూర్తి అయిందని ఆర్ ఓ లు నరసింహారెడ్డి, తేజోరామ్ లు కలెక్టర్ కు వివరించారు.
కోదాడ డిసెంబర్ 14 ః సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఆదివారం ఆయన కోదాడ మండల పరిధిలోని గణపవరం, బిక్య తండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు.ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్న తీరును, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
సూర్యాపేట జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు. ఈ క్రమంలో సంబంధిత వ్యక్తుల నుంచి ఐదు లక్షల రూపాయలకు బైండోవర్ చేయించినట్లు వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణ కోసం గ్రామపంచాయతీ సిబ్బంది, ఎన్నికల సిబ్బందితో పోలీసు సిబ్బందిని మోహరించామని చెప్పారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర నిఘా కొనసాగుతుందని, శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
మోతె, డిసెంబర్ 14 : పటిష్ట బందోబస్తు మధ్య హోటల్ లెక్కింపు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని, కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
మధ్యాహ్నం 1:00 గంటలలోపు పోలింగ్ కేంద్ర ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్కరికి టోకెన్లు జారీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించాలని అలాగే కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. నామవరం గ్రామపంచాయతీలోని 10 వార్డు లలో 2503 ఓట్లు ఉన్నాయని ఉదయం 10:45 గంటల వరకు 63 శాతం పోలింగ్ పూర్తి అయిందని ఆర్ ఓ వెంకట కృష్ణారెడ్డి కలెక్టర్‌కు వివరించారు.