15-12-2025 12:56:16 AM
రెండు ఆయుధాలతోనే మోదీ, అమిత్‌షాను ఓడిస్తాం
హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : ‘ మా పోరాటానికి సమయం పట్టొచ్చు.. సత్యం, ఆహింసా ఆయుధాలతోనే అంతిమ విజయం సాధిస్తామని.. వాటితోనే మోదీ అమిత్‌షాలను ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ‘ ఓట్ చోర్ గద్దీ ఛోడ్ ’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించింది.
ఈ ర్యాలీకి ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అనేది దేశానిది, మోదీకి పరిమితం కాదనే విషయం ఈసీ గుర్తించాలని హితవు పలికారు.
ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసి పని చేస్తున్నాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌కు ఇమ్యూనిటీ కల్పిస్తూ ప్రధాని మోదీ చట్టం తెచ్చారని, భవిష్యత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని మారుస్తుందని, అవసరమైతే కమిషనర్లపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఎంత చెబితే అంత అన్నట్లుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమకు ప్రజాస్వామిక సిద్ధాంతాలపై నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా, ప్రజాస్వామ్య పంథాలోనే పోరాటం సాగిస్తుందని చెప్పారు. ప్రపంచం సత్యం వైపు చూడదని, అధికారకం వైపు చూస్తుందని, అధికారం ఉన్న వాడినే గౌరవిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ ఛీప్ మోహన్‌భగవత్ చెబుతున్నారని రాహుల్‌గాంధీ విమర్శించారు.
ఇది మోహన్‌భగవత్, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచన అని రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రపంచలోని ప్రతి మతం సత్యమే చెబుతోందన్నారు. సత్యాన్ని ఆచరిస్తూనే .. నరేంద్రమోదీని, అమిత్‌షా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇండియా నుంచి తొలగించవచ్చని రాహుల్‌గాంధీ తెలిపారు.
ఓట్ చోరీతోనే బీజేపీ గెలుపు
ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ
ఓట్ల రక్షణ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం తాము పోరాడుతున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. బీజేపీ ఓట్లను చోరీ చేసి గెలుస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదన్నారు. దేశ ప్రజలకు మోదీ, అమిత్‌షాలపై నమ్మకం పోయిందన్నారు. మహారాష్ట్ర, హరియాణా, బీహార్‌లో ఓటు జరిగిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
ఓటుకు రూ. 10 వేలు ఇస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె నిలదీశారు. మోదీ తప్పు చేయడం వల్లే పార్లమెంట్‌లో తాను మాట్లాతుంటే కళ్లలోకి కళ్లు పెట్టి కూడా చూడలేరని విమర్శించారు. దేశం ఐక్యంగా ఉండటం, న్యాయం కోసం రాహుల్‌గాంధీ 8 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని ప్రియాంక గాంధీ వివరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఈ వయసులో కూడా ప్రజల కోసం పోరాడుతున్నారని తెలిపారు. ఓట్ల రక్షణ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణ కోసం తాము పోరాడుతామన్నారు. ఎన్నికల్లో ఓట్ల చోరీ , ఓటర్ల జాబితా సవరణల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిచారు.