బోధన్ మధు మలంచ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల దుస్థితి
తక్షణ చర్యలు తీసుకోవాలి: తెలంగాణ రక్షణ సేన
బోధన్,(విజయ క్రాంతి): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కమిటీ సోమవారం బోధన్ పట్టణంలోని మధు మలంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడి మౌలిక వసతులను పరిశీలించింది. పాఠశాలలో సుమారు 260 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, బాలికలు, ఉపాధ్యాయులకు తగిన బాత్రూమ్ సౌకర్యాలు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని కమిటీ పేర్కొంది. విద్యార్థుల ప్రాథమిక అవసరాలకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది.
అలాగే పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడం, వర్షపు నీరు ఆవరణలో నిల్వ ఉండడం, తాగునీటి సౌకర్యం తగినంతగా లేకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 260 మంది విద్యార్థులకు రోజుకు కేవలం 20 లీటర్ల సామర్థ్యం గల ఆరు మినరల్ వాటర్ క్యాన్లు మాత్రమే అందించడం సరిపోవడం లేదని అభిప్రాయపడ్డారు.
కొన్ని సందర్భాల్లో విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు వచ్చి రోడ్లపై తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, పాఠశాల పరిసరాల్లో ముండ్ల పొదలు, చెత్త, మురుగు, దుర్వాసన వ్యాపించి విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. చికెన్, మటన్ వ్యాపారాలకు సంబంధించిన వ్యర్థాలను కూడా పాఠశాల సమీపంలో పడేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలు చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్ర చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలంగాణ రక్షణ సేన నిజామాబాద్ జిల్లా కమిటీ విమర్శించింది.
తెలంగాణ రక్షణ సేన డిమాండ్లు:
- బాలికలు, బాలురు, ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక బాత్రూమ్‌లను తక్షణమే నిర్మించాలి.
- పాఠశాలకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలి.
- పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం కల్పించాలి.
- పాఠశాల పరిసరాల్లోని చెత్త, మురుగు, ముండ్ల పొదలను వెంటనే తొలగించాలి.
- చికెన్, మటన్ వ్యర్థాలను పాఠశాల సమీపంలో పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
- అవసరమైన అన్ని మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.
విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు, ఆర్మూర్ ఇన్‌చార్జ్ నవీన్ రెడ్డి, బోధన్ జిల్లా నాయకులు రజాక్, దొంత ప్రవీణ్ కుమార్, శేఖర్ రాజు, ఇరుముల శంకర్, శ్రీనివాస్ గౌడ్, రాఘవేందర్, సన్నీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






