28 July, 2026 | 1:47 AM

అర్ధాకలితో ఏ బిడ్డా బడికి పోవొద్దు

28-07-2026 12:49 AM
  1. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు
  2. ఉచితాలు కావు.. ప్రజా పెట్టుబడులు
  3. పీపుల్స్ మార్చ్ నుంచే ప్రజాహిత ఇందిరమ్మ పథకాలు
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  5. ఖమ్మం జిల్లా మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సెంటర్ ప్రారంభం

ఖమ్మం, జూలై 27 (విజయక్రాంతి): అర్ధాకలితో ఏ పేద బిడ్డ బడికి పోవొద్దని, విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉచిత పథకాలు రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంగా ప్రకటించారు. పరిశ్రమలు ప్రాజెక్టులు ఇతర అనేక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టినట్లుగానే పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరి పైన ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని ఆయన అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహార అల్పాహారాన్ని అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సెంటర్‌ను సోమవారం ఖమ్మం జిల్లా మధిరలో ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఆశయమని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం ఉదయమే రుచికరమైన, శుచి-శుభ్రతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహార పథకాన్ని మధిర నియోజకవర్గంలో ప్రారంభించినట్లు చెప్పారు.

ఏ రాష్ట్ర అభివృద్ధికైనా సహజ వనరులు ఎంత అవసరమో.. సమర్థవంతమైన మానవ వనరులు కూడా అంతే అవసరమని భట్టి విక్రమార్క నొక్కి వక్కాణించారు. అత్యంత ప్రతిభావంతులుగా తయారైనటువంటి మానవ వనరులు ఉన్న రాష్ట్రం, దేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా మారుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకి ఒకటే సమయానికి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 20 లక్షల మంది, రెసిడెన్షియల్ స్కూళ్లలోని 7 లక్షల మంది పిల్లలతో కలిపి మొత్తం 27 లక్షల మందికి ఒకే సమయానికి వేడివేడిగా అల్పాహారం అందించడం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశంమని అన్నారు. హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో మెకనైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మధిరలోని తాత్కాలిక సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా 16 మండలాల స్కూళ్లకు వాహనాల్లో అల్పాహారం అందిస్తున్నామని అన్నారు.

రాబోయే 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత కిచెన్ నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారాన్ని అందించనున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. పిల్లలకు అందించే అల్పాహారంతో పాటు పౌష్టికాహారం కోసం వారానికి 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావను ప్రత్యేకంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన బడి పిల్లలతో కలిసి భోజనం చేశారు. పాలన అంటే ఒక హోదా కాదు.

అధికారం అంటే పెత్తనం చలాయించడం కాదు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన ’పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో తాను గుర్తించిన ప్రజల సమస్యలు.. బడుల దుస్థితి, నిరుద్యోగుల ఆవేదన, ఇల్లు లేని పేదల బాధలను తీర్చేందుకు ఆనాడే నా మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనలే నేడు ఒక్కొక్కటిగా పథకాలుగా మారుతున్నాయని భావోద్వేగానికి లోనయ్యారు.

కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస ప్రభు, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సీఈఓ, కౌంతేయ స్వామీజీ, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కలెక్టర్ దివాకర టీఎస్, కార్పొరేషన్ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.