11-02-2026 01:22:36 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧౦: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం ౧:14 గంటలకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల సభ్యులు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ నిబంధనల ప్రకారం ఈ నోటీసు అందజేశారు. స్పీకర్ తీరు ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో ఉందని వారు నోటీసీలు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ నోటీసును సమర్పించగా, 118 మంది ఎంపీలు నోటీసుపై సంతకాలు చేశారు.
కాంగ్రెస్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఇతర వామపక్షపార్టీలన్నీ తీర్మానానికి మద్దతు తెలిపాయి. అయితే.. ఆ నోటీసుల్లో సంవత్సరం ౨౦౨౬కు బదులు ౨౦౨౫ అని తప్పుదొర్లింది. వెంటనే గుర్తించిన ఎంపీల బృందం తప్పును సవరించి, మళ్లీ రెండోసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వకపోవడం, కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు మైకులు కట్ చేయడం, ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం.. వంటివి ఈ అవిశ్వాస తీర్మానానికి దారితీశాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల గొంతు నొక్కడం తగదని విపక్ష ఎంపీలు పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని, అనివార్య పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నోటీసుపై సంతకం చేయలేదు. పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్ష నేత స్పీకర్‌పై అవిశ్వాస నోటీసుపై సంతకం చేయడం సముచితం కాదని ఆయన భావించినట్లు తెలిసింది.
అలాగే.. అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభ్యులు దూరంగా ఉన్నారు. ఇప్పటికప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం సరికాదని, ఆ పార్టీ అభిప్రాయపడింది. విపక్షాలు ముందు ఒక నిరసన లేఖ రాసి, తర్వాత రెండు మూడు రోజులు వేచి బాగుండేదనేది ఆ పార్టీ వైఖరి. మరోవైపు నోటీసు ఇచ్చి విపక్షాలు పెద్ద పొరపాటు చేశాయని బీజేపీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ
అవిశ్వాస తీర్మానంపై మార్చి రెండో వారం లో జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ రోజు స్పీకర్ గైర్హాజరులో ఉంటారు. సభలో కనీసం 50 మంది ఎంపీలు లేచి నిలబడి అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. అప్పు డే.. డిప్యూటీ స్పీకర్ లేదా ప్యానెల్ స్పీకర్లు అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం ఇస్తారు.
అవిశ్వాసం తేలేవరకూ స్పీకర్ గైర్హాజరు
స్పీకర్‌పై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మాన నోటీసులివ్వడంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తీర్మానం సంగతి తేలేవరకూ సభకు హాజరు కావొద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నైతిక విలువల దృష్ట్యా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సభకు హాజరు కావాలని స్పీకర్‌ను ప్రతిపక్ష ఎంపీలు కోరినప్పటికీ, మంగళవారం ఆయన హాజరుకాకపోవడం గమనార్హం.