చేతులకు మెహందీ ఉన్నా నోఎంట్రీ!

06-05-2024 01:06:13 AM

రేపటి నుంచి ఎప్‌సెట్ షురూ

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): టీఎస్ ఎప్‌సెట్ పరీక్షలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7 నుంచి 11 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉద యం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు చేతులకు మెహందీ, టాటూలు ఉంటే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. 90 నిమిషాల ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం నిబంధనను అమలు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతిం చరు.  ఈసారి దాదాపు 3.60లక్షల మంది అభ్యర్థులు ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ఎప్ సెట్‌కు 35వేల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. 

అగ్రికల్చర్ ఫార్మసీకి 135 కేంద్రాలు, ఇంజినీరింగ్‌కు 166 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మూడు భాషల్లో ప్రశ్నపత్రాలు ఉంటాయి. అయితే ప్రశ్నల్లో ఏవైనా పొరపాట్లుంటే ఇంగ్లిష్ ప్రశ్నలనే ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు తగిన గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాలను ఒక రోజు ముందుగానే చెక్ చేసుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఉదయం సెషన్ 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్షలు జరగనున్నాయి.