నిధులు లేవు.. విధులూ లేవు!
రెండేళ్ల క్రితమే వివిధ కార్పోరేషన్లకు చైర్మన్ల నియామకం
సబ్సిడీ నిధులు రావు.. లబ్ధ్దిదారులకు ఇవ్వరు!
జూలై రెండోవారంలో ముగియనున్న పదవీకాలం
మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న చైర్మన్లు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెం టనే 37 మందిని చైర్మన్లుగా నామినేటెడ్ పదవుల్లో భర్తీచేసింది. ఆ తర్వాత మరో ఐదారుగు రిని ప్రభుత్వం నియమించింది. ఇంకా భర్తీచేయని నామినేటెడ్ పోస్టులు 30కి పైగానే ఉన్నాయి. అయితే మొదటి విడతలో భర్తీచేసిన వాటిలో కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ, మహిళా, దివ్యాంగులతో పాటు వివిధ కులాల కార్పోరేషన్లు కూడా ఉన్నాయి.
మొదటగా భర్తీచేసిన చైర్మన్ల పదవీ కాలం జూలై రెండోవారంలో ముగుస్తుంది. అయితే వీరి పదవీ కాలంలో ఏ ఒక్కరికి కూడా కార్పోరేషన్ల ద్వారా నిధులు ఇవ్వలేదు. దాంతో కార్పోరేష న్ల ద్వారా సాయం చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఆయా కార్పోరేషన్ల చైర్మన్లకు రుణాలు ఇప్పించాలని నిత్యం ఒత్తిడి ఉన్నా.. చైర్మన్లు చేసేదేమీలేక మిన్నకుండిపోతున్నారు.
పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు, సమావేశాలకు వెళ్లడం తప్ప.. ప్రభుత్వపరంగా నిరుద్యోగ యువతకు, నమ్ముకున్న కేడర్‌కు న్యాయంచేయలేని పరిస్థితి వారిది. పదవీకాలం ముగియనుండటం తో తమకు మరోసారి అవకాశం కల్పించాలని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.
రాష్ట్రంలోని వివిధ కార్పోరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించలేని దుస్థితి నెలకొన్నది. నిధుల లేమితో గతేడాది అట్టహాసంగా ప్రారంభించిన యువ వికాసం పథకం అటకెక్కింది. ఈ పథకం కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే సర్కార్ నిధులు విడుదల చేయకపోడంతో నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పిషర్మెన్, వికలాంగులతో పాటు వివిధ కులాల ఫెడరేషన్లు, కార్పోరేషన్లలో.. యువతకు ఉమ్మడి రాష్ట్రం లో ప్రతి ఏటా సబ్సిడీ ద్వారా ప్రభుత్వం రుణాలు ఇవ్వడం జరుగుతుండేది.
కానీ, రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారి పోయింది. బీఆర్‌ఎస్ హయాంలో రెండు, మూడేళ్లు నిరుద్యోగ యువతకు రుణాలు ఇచ్చినా.. వాటికి సబ్సిడీని విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తికావస్తున్నా ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఆయా కార్పోరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వలేదు. ఎన్నికల ముందు ఇప్పుడున్న కార్పోరేషన్లకు అదనంగా కులాలవారీగా కార్పోరేషన్లు ఏర్పాటుచేసి.. ఆయావర్గాల యువతను రుణాలు ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తామన్న హామీ నీటి మూటగానే మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ కార్పోరేషన్ల ద్వారా కొత్త రుణాలు ఇవ్వకపోగా.. గత ప్రభుత్వం హయాంలో ఇ చ్చిన రుణాలకు కనీసం సబ్సిడీ నిధులను కూడా విడుదల చే యడం లేదు. దీంతో గతంలో రుణాలు తీసు కున్న వ్య క్తులు.. తిరిగి బ్యాంకులకు అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా గత ప్ర భుత్వంలో లక్షలాది మంది యువత ఎ క్కువగా వాహనాలు తీసుకొని సొంతంగా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
రూ. 1 లక్ష వరకు 80 శాతం, రూ. 2 లక్షల వర కు 70 శాతం, రూ. 3 నుంచి రూ. 10 లక్షల వరకు 60 శాతం వరకు ఇస్తామన్న సబ్సిడీని ప్రభుత్వం ఇప్పటీ వరకు విడుదల చేయకపో వడంతో లబ్దిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గిరిజన కార్పోరేషన్ ద్వారా ఎస్టీ యువత దాదా పు 29 వేల మంది వరకు సబ్సిడీ రుణాల కోసం ఎదురు చూ స్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బ్యాంకుల ద్వారా రు ణాలు తీసుకున్నారు.
వీరికి సబ్సి డీ కింద ప్రభుత్వం సుమారుగా రూ. 221 కోట్ల వరకు విడుదల చేయాల్సి ఉంది. ఎస్సీ కార్పోరేషన్ నుంచి కూ డా గత సర్కార్ హయాంలోనే 50 వేల మందికి పైగా పథకాల కింద సబ్సీడీ రుణాలు తీసుకున్నారు. ఎస్సీ కార్పోరేషన్ సబ్సిడీ కింద విడుదల చేయాల్సిన రూ. 300 కోట్ల వరకు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినట్లు అ ధికారులు పేర్కొంటున్నారు. బీసీ కార్పోరేషన్‌తో పాటు మిగతా కులాల కార్పోరేషన్లలోనూ ఇదే పరిస్థితి.






