ఇంటి పేరుతో సంబంధమే లేదు
కష్టపడితేనే ఏదైనా సాధించగలం
జొమాటో సీఈవోను ప్రశంసించిన మోదీ
న్యూఢిల్లీ, మే 22: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం భారత్‌లో ఇంటి పేరుతో పట్టింపు లేదని, ఆయన ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ ప్రేరణనిస్తుందని కొనియాడారు. ఇటీవల కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ నిర్వహించిన విశేష్ సంపర్క్ కార్యక్రమంలో దీపిందర్ పాల్గొన్నారు.
ఆ సమావేశంలో మాట్లాడుతూ.. జొమాటో సంస్థ ప్రారంభ రోజుల నాటి అనుభవాలను వివరించారు. చిన్న పట్టణం నుంచి వచ్చిన తాను ప్రభుత్వ సహకారంతో ఇంత పెద్ద సంస్థను నిర్మించడం సాధ్యమవుతుందని నిరూపించినట్లు చెప్పారు. ఈ వీడియోను హర్‌దీప్ పోస్ట్ చేయగా మోదీ దానికి రిప్లయి ఇచ్చారు. ఇప్పుడు భారతదేశంలో ఇంటి పేరుతో ఎలాంటి పట్టింపు లేదు. కష్టపడటమే ఇక్కడ ముఖ్యం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మీ ప్రయాణం ఒక ప్రేరణ, స్ఫూర్తిదాయకం.
స్టార్టప్‌ల అభివృద్ధి కోసం అనుకూల వాతావరణాన్ని అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం అని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా, విశేష్ సంపర్క్ కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ.. స్టార్టప్ ప్రారంభించాలన్న ఆలోచనపై తన తండ్రితో సంభాషణను ఆయన గుర్తు చేసుకున్నారు. నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా? ఇంత చిన్న ఊరిలో మనమేం చేయగలం? అది అసాధ్యం అని ఆయన తండ్రి అన్నట్లు గోయల్ తెలిపారు. కానీ, ప్రభుత్వ సహకారంతో తన కల సాకారమైందన్నారు. 2008లో జొమాటోను స్థాపించినప్పటి నుంచి నేటి వరకు లక్షలాది మందికి ఉపాధి కల్పించటం పట్ల గర్వంగా ఉందన్నారు.






