ఇకపై టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్!

07-05-2024 02:01:15 AM

కొత్త విద్యా సంవత్సరంనుంచి అమలు

టీచర్ల సమయపాలనపైవిద్యాశాఖ ఫోకస్

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్) అమల్లోకి రానుంది. ఈ విధానాన్ని కొత్త విద్యాసంవత్సరం 2024 నుంచి టీచర్లకు అందుబాటులోకి తేనున్నారు. గతేడాది ఈ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అమల్లోకి తెచ్చారు. ఇందు కోసం గత విద్యాసంవత్సరం జూన్‌లోనే టీచర్లకు ట్యాబ్‌లను పంపిణీ చేసి విద్యార్థుల ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ నమోదు చేపట్టారు. కొత్త విద్యాసంవత్సరం నుంచి టీచర్లకు సైతం ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. పాఠశాలలకు వెళ్లే టీచర్లు, విద్యార్థులతో పాటు తమ తమ హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ఆధారంగా పనిచేస్తోంది.

ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో రిజిస్ట్రేషన్.. 

గతంలో రిజిస్టర్‌లోనే విద్యార్థులు, టీచర్ల అటెండెన్స్‌ను తీసుకునేవారు. కరోనా ముందు వరకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమలు చేశారు. ఆ తర్వాత జియో అటెండెన్స్‌ను అమలు చేసి అనంతరం దాన్ని నిలిపివేశారు. ఇప్పుడు కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయబోతున్నారు. స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్‌లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి కెమెరా ఆధారంగా స్కాన్ చేయగానే ముఖాలను గుర్తించి దానికదే హాజరు నమోదు చేసుకుంటుంది. ఉపాధ్యాయులకు ఇచ్చిన ఐడీ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ముందస్తుగా టీచర్ల వ్యక్తిగత చిత్రాలు ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ట్యాబ్ లేదా స్మార్ట్ ఫోన్ సహాయంతో టీచర్ హజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా ముఖాల ఆధారంగా ఎవరెవరు హాజరయ్యారో ఇట్టే తెలిసిపోతుంది. పాఠశాలలకు టీచర్లు సరిగా విధులకు హాజరు కావడం లేదని, పాఠశాలకు వచ్చి హాజరు వేసుకొని మధ్యలోనే వెళ్లిపోతున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో టీచర్ల అటెండెన్స్‌పై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమలుకు చర్యలు చేపట్టింది.