ఐఐటీల్లోనూ నో ప్లేస్‌మెంట్స్!
దాదాపు 38 శాతం మందికి దక్కని ఉద్యోగాలు
న్యూఢిల్లీ, మే 23 : మన దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఐఐటీలో చదివితే చాలు మంచి కంపెనీల్లో ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు అనుకుంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం దృష్ట్యా పెద్ద టెక్ కంపెనీలు, అనేక బహుళజాతి కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. దీంతో, ఎంతో ఖ్యాతి గడించిన ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనూ ప్లేస్‌మెంట్స్ అంతంతమాత్రంగానే ఉన్నా యి. ఈ ఏడాది మన దేశంలోని ఐఐటీల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో దాదాపు 38 శాతం మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దక్కకపోవడం గమనార్హం. ఐఐటీ కాన్పూర్ విద్యార్థి ధీరజ్ సింగ్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీ క్యాంపస్‌ల్లో దాదాపు 8 వేల మంది (38%) విద్యార్థులకు ప్లేస్‌మెంట్ దక్కలేదని తేలింది. 2004లో 21,500 మందికి గాను 13,400 మంది మాత్రమే ప్లేస్‌మెంట్స్ సాధించారని, మిగతా వారు ఇంకా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడైంది. రెండేళ్ల క్రితంతో పోలి స్తే ఈ పరిస్థితి దాదాపు రెట్టింపు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.






