1 August, 2026 | 3:43 PM

నాకు దేశమే ముఖ్యం

24-05-2024 02:00 AM

ప్రతిపక్షాలకు కుటుంబాలే ముఖ్యం

కాంగ్రెస్‌తో సంబంధమున్న పార్టీలన్నీ సిక్కు వ్యతిరేకులే

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇండియా కూటమి ఎంతకైనా తెగిస్తుంది

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కుట్ర

న్యూఢిల్లీ, మే 23: ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీలు కుటుంబ రాజకీయా లు చేస్తాయంటూ దుయ్యబట్టారు. బీజేపీ మంత్రం ‘నేషన్ ఫస్ట్’ అయితే ప్రతిపక్షాలది ‘ఫ్యామిలీ ఫస్ట్’ మంత్రం అని చురకలు అంటించారు. కాంగ్రెస్‌తో అంటకాగుతున్న పార్టీలన్నీ సిక్కు వ్యతిరేక అల్లర్లకు బాధ్యులేనని ఆరోపించారు. గురువారం హర్యానా లోని భివానీ మహేంద్రగఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండియా కూటమి ఎప్పుడు స్థిరంగా ఉండదని, ఐదేళ్లకు ఐదుగురు ప్రధానులను చేసే ప్లాన్‌లో ప్రతిపక్షాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మతతత్వం, కులతత్వం, కుటుంబ రాజకీయాలను విస్తరిస్తారని దుయ్యబట్టారు. ఎన్నికల లబ్ధి కోసం దేశ విభజనకు కాంగ్రెస్ మద్దతిచ్చిందని, ఓటు బ్యాంకే కాంగ్రెస్‌కు ముఖ్యమని, అదే కాంగ్రెస్ అసలైన ముఖమని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్లను లాక్కుని మతప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు.

జాతీయ జెండాపై గౌరవం లేదు

కాంగ్రెస్ పార్టీకి జాతీయ జెండాపై గౌరవం, నమ్మకం లేదని మోదీ దుయ్యబట్టారు. అందుకే గత 70 సంవత్సరాలుగా కశ్మీర్ జాతీయ జెండా ఎగురవేయకుండా చేశారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు కోసం ఇండియా  కూటమి ఎంతకైనా తెగిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు బ్యాంకు కోసమే శ్రీరాముడిని, అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వ్యతిరేకించాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి రామమందిరాన్ని నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.