21 April, 2026 | 4:34 AM

అంతా మా ఇష్టం!

21-04-2026 02:58 AM

అంటున్న నాన్ దోస్త్ కాలేజీలు

దోస్త్ పరిధిలోకి రాకుండా అడ్మిషన్లు చేపడుతున్న కాలేజీలు

ఫీజులు పెంచితే వస్తామంటూ పేచీ

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఒకే విధానం కింద ఉండాల్సిన ప్రవేశాల ప్రక్రియ రెండు విధాలుగా కొనసాగుతోంది. ఒకటి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను కామన్ అడ్మిషన్ విధానం ద్వారా ప్రభుత్వం చేపడుతుంటే మరోవైపు ఈ దోస్త్ పరిధిలో చేరని కాలేజీలు తమ స్వతహాగా అడ్మిషన్లను చేపడుతున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

దోస్త్ పరిధిలోకి రాని నాన్ దోస్త్ కాలేజీలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. దోస్త్ పరిధిలోకి రావాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చేస్తు న్న విజ్ఞప్తులను తోసిపుచ్చుతున్నాయి. తమ కాలేజీల్లో తమకు నచ్చినంత ఫీజులు వసూ లు చేసుకుంటామనే ధోరణిలో వ్యవహరిస్తున్నాయి. పైగా ఫీజులు పెంచాలనే ప్రతిపాద నను ఉన్నత విద్యామండలి ముందు ఉంచారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను తాము ఒప్పుకొబోమని తెగేసి చెప్తున్నాయి. తమ కాలేజీ తమ ఇష్టం..తాము నిర్ణయించిందే ఫీజు అన్నట్లుగా ఆయా కాలేజీలు నడుచుకుంటున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 969 డిగ్రీ కాలేజీలు ఉండగా, వీటిలో 60 ప్రైవేటు కాలేజీలు దోస్త్ పరిధిలో కొనసాగడం లేదు. వీటిలోనూ 43 ప్రైవేట్ కాలేజీలు కాగా, మరో మూడు ప్రైవేట్ అటానమస్ కాలేజీలు, 11 కాలేజీలు ఎయిడెడ్, మూడు కాలే జీలు ఎయిడెడ్ అటానమస్ కాలేజీలు ఉన్నాయి. ఈ నాన్ దోస్త్ కాలేజీల్లో మొత్తం 38,586 సీట్లుండగా, 46 ప్రైవేట్ కాలేజీల్లో 28,655 సీట్లుంటే మిగిలినవి ఎయిడ్ కాలేజీల్లో ఉన్నాయి. 2025 విద్యాసంవ త్సరంలో 38,586 సీట్లకు 17,583 సీట్లు నిండగా, అందులో అమ్మాయిలు 8,099 మంది, అబ్బాయిలు 9,484 మంది చేరారు.

ఈ సీట్లను ప్రతి ఏటా సర్కారు నిబంధనలను బేఖాతరు చేస్తూ దోస్త్ పరిధిలోకి రాకుండా ఇష్టానుసారంగా అడ్మిషన్లు చేసుకుంటు న్నాయి. దోస్త్  పరిధిలోని డిగ్రీ కాలేజీలకు మాత్రమే ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో యూనివర్సిటీలు ఫీజులు నిర్ణయిస్తుంటాయి.

వీటిలో ఒక్కో కోర్సును బట్టి ఉస్మానియా యూనివర్సిటీలో పరిధిలో దాదాపు రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు మాత్రమే ఫీజులు ఉన్నాయి. వీటిని మాత్రమే ఆయా కాలేజీలు వసూలు చేస్తున్నాయి. కానీ, ఈ ఫీజులు తమకు సరిపోవంటూ నాన్ దోస్త్ కాలేజీలు కొన్ని తమ ఇష్టానుసారంగా ఫీజులను నిర్ణయించి దాదాపు రూ.50 వేలకుపైగానే విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఈ కాలేజీలపై అటు యూనివర్సిటీ, ఇటు ఉన్నత విద్యామండలి పెత్తనం పెద్దగా లేకపోవడంతో వారి ఆడిందే ఆట అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

ఎప్పుడూ దోస్త్ నోటిఫికేషన్‌కు ముందు ఆయా కాలేజీలను బతిమాలడం విద్యామండలి వంతవుతోంది తప్పితే దోస్త్ పరిధిలోకి మాత్రం ఆ కాలేజీలు తీసుకొరాలేక పోతున్నారు. పైగా ప్రతిసారీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అడ్మిషన్లనూ చెపడుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈసారి చర్చల ద్వారా దోస్త్ పరిధిలోకి రావాలని కోరుతామని, ఒకవేళ రాకుంటే తాము సైతం న్యాయపరంగానే ఎదుర్కొంటామని, దోస్త్ పరిధిలోకి వచ్చేలా చేస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు.