27 February, 2026 | 1:47 AM

పనిచేయని ఈ-నామ్ 2.0

27-02-2026 12:14 AM
  1. రెండు రోజులుగా నిలిచిన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు 
  2. నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయంపై పసుపు రైతుల దాడి
  3. రాష్ట్రంలోని పలు మార్కెట్లలో  రైతుల ఆందోళన 
  4. మ్యానువల్ పద్ధతిన కొనుగోళ్లు 

నిజామాబాద్/మహబూబాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ విధానం ఈ-నామ్ అమలు చేస్తున్న వివిధ మార్కెట్లలో బుధవారం నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన 2.0 వెర్షన్ ఆదిలో హంసపాదుగా మారింది. రెండో రోజు కూడా ఆన్లైన్ విధానం మొరాయించింది. దీం తో రాష్ట్రంలోని 47 వ్యవసాయ మార్కెట్లలో రైతుల వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారులు కొనడానికి ఆటంకంగా మారింది.

ఈ నామ్ విధానం పనిచేయకపోవడంతో నిజామాబాద్ మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. అలాగే వివిధ చోట్ల నూతన సాఫ్ట్‌వేర్ సరిగా పనిచేయకపోవడంతో మార్కెట్ల కార్యదర్శులు మ్యానువల్ విధానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టారు.

దీంతో చాలాచోట్ల మార్కెట్లలో రైతులు గంటలు తరబడి తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. డిజిట ల్ విధానాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టడం తో మార్కెట్లలో ఆధునిక పద్ధతి తొలగిపోయి పాత పద్ధతి మొదలు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

నిజామాబాద్‌లో రైతుల ఆందోళన

నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు విక్రయించడానికి వచ్చిన రైతులు కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ, గంటల తరబడి నిరీక్షించలేక ఆగ్రహంతో మార్కెట్ కార్యాలయంలోకి దూసుకు వెళ్లి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి వెన క్కి పంపారు. పాత పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోల్లను ప్రారంభించారు. బుధవా రం 20 వేల బస్తాలు పసుపు మార్కెట్ యార్డ్ కు చేరుకోగా రెండవ రోజైన గురువారం మరో ఆరు వేల పసుపు బస్తాలు మార్కెట్‌కు రైతులు తెచ్చారు.

రెండు రోజులుగా విక్రయా లు జరగకపోవడంతో రైతులు అసహనానికి గురై, మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బందిని నిలదీశారు. తమ చేతుల్లో ఏమీ లేదని, ఇది రాష్ట్రవ్యాప్తంగా జరిగే  ప్రక్రియ అని అధికారులు రైతులకు తెలపడంతో సహనం కోల్పోయిన రైతులు తమ పంటలను కొనాల ని డిమాండ్ చేస్తూ కార్యాలయంపై దాడి చేశారు.

గత్యంతరం లేని పరిస్థితుల్లో మార్కెట్ కమిటీ అధికారులు పాత పద్ధతి ప్రకారం మాన్యువల్‌గా పసుపు విక్రయాలు కొనసాగించారు.  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లోనూ మ్యానువల్ పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తులను కొను గోలు చేశారు. ఇలాగే వివిధ మార్కెట్లలో డిజిటల్ విధానాన్ని పక్కనపెట్టి పాత పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టడం వల్ల మళ్లీ మొదటికి వచ్చినట్లు అయిందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఎందుకీ సమస్య?

దేశంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, ఎక్కడ కూడా ఎలాంటి మోసాలకు తావు లేకుం డా డిజిటల్ విధానం అమలు చేయడానికి 2016లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రైతు సంక్షేమం మంత్రిత్వ శాఖ స్మాల్ ఫార్మ ర్స్ అగ్రి బిజినెస్ కన్సర్యం (ఎస్ ఎఫ్ ఏ సి) ఆధ్వర్యంలో జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ విధానం ఈ  నామ్ ప్రవేశపెట్టింది.

ఇందుకోసం ఈ నామ్ విధానాన్ని అమలు చేయడానికి ఎస్ ఎఫ్ ఏ సి నేతృత్వంలో నిర్వహణ బాధ్యతలను ఎన్ ఎఫ్ సిఎల్‌కు అప్పగించగా పూర్తిగా డిజిటల్ విధానాన్ని అమలు చేస్తూ 1.0 వెర్షన్ ప్రవేశపెట్టారు. ఆ విధానంలో కొన్ని లోపాలను గుర్తించడంతోపాటు సదరు సంస్థ తో ఈ ఏడాది జనవరి నెలలో అగ్రిమెంట్ ముగిసిపోవడంతో కొత్తగా ‘అకాల్’ అనే మరో సంస్థతో ఈ నామ్ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించారు.

అయితే ఆ సంస్థ ఉన్నట్టుండి పాత 1.0 వెర్షన్ కు బదులు 2.0 వెర్షన్ ద్వారా కొత్తగా కొన్ని మాడ్యూల్స్ ప్రవేశపెట్టింది. కొత్త మాడ్యూల్స్, 2.0 వెర్షన్ లో సాంకేతిక ఇబ్బందులు ఇప్పుడు మార్కెట్లలో ఈ నామ్ విధానం అమలుకు ప్రతిబంధకంగా మారాయని రైతులు, వ్యాపారులు, అధికారులు పేర్కొంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఏర్పడ్డ సాంకేతిక సమస్యను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నారని, శుక్రవారం నాటికి ఇబ్బందులు తొలగిపోయి ఈ నామ్ విధానం తిరిగి గాడిలో పడే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.