సంగారెడ్డిలో ఒక్క ఓటు మిస్ కావొద్దు
కాంగ్రెస్ బీఎల్‌ఏలు, నాయకులకు జగ్గారెడ్డి, నిర్మల ఆదేశం
సంగారెడ్డి, జూలై 19 : సంగారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు మిస్ కాకుండా కాంగ్రెస్ బిఎల్వో లు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశించారు. గత నెల రోజులుగా అమలవుతున్న సర్ ప్రక్రియపై ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ లో కాంగ్రెస్ బిఎల్‌ఏలు, ముఖ్య నా యకులతో జగ్గారెడ్డి, నిర్మల అత్యవసర స మావేశం ఏర్పాటు చేశారు. సర్ ప్రక్రియకు ఇంకా పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌ డ్, ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ సమావేశం ఏర్పా టు చేసి దిశా నిర్దేశం చేశారు.
ఈ నేపథ్యంలో సంగారెడ్డి లో ఆదివారం సాయంత్రం బిఎల్‌ఏలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని 282 బిఎల్‌ఏ లతో ఒక్కొక్కరితో జగ్గారెడ్డి ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటికి ఎన్ని ఫారాలు పంపిణీ చేశారు, ఇచ్చిన ఫారాల్లో ఎన్ని తిరిగి వచ్చాయి, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది అని అడిగి వారి నుండి సమాచారం తీసుకున్నారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జి మీనాక్షి నటరాజన్ లు సర్ ప్రక్రియ పై దిశా నిర్దేశం చేశారని, వారి ఆదేశాల మేరకు ప్రతీ ఒక్క బిఎల్‌ఏ లు స్వయంగా తమ వార్డు పరిధి లోని ప్రతీ ఇంటికి వెళ్ళాలని, ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ప్రతీ ఓటు నమోదు జరిగేలా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.
ఇప్పటి వరకు సంగారెడ్డి నియోజకవర్గం లో 66.67% ఓటరు నమోదు పూర్తయిందని, గడువు పది రోజులు ఉన్నప్పటికీ రానున్న ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి, ఆత్మ చైర్మెన్ ప్రభు, నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






