హైడ్రా నుంచే నోటీసులు!
72 బృందాలు ఏర్పాటు
పోలీసు, సర్వే, నీటిపారుదల శాఖల నుంచి సిబ్బంది కేటాయింపు
సీఎస్ శాంతికుమారి వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి) : ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి తెలిపారు. చెరువుల ఆక్రమణ తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ మహేష్‌భగవత్, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్‌ఎండీ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్‌తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నాయని, దీనివల్ల గందరగోళం ఏర్పడుతున్నదని అన్నారు.
అన్ని రకాల నోటీసులు, తొలగింపులన్నీ హైడ్రా పరిధిలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎఫ్‌టీఎల్, నాలా కబ్జాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల పరిరక్షణ హైడ్రా పరిధిలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. గండిపేట, హిమాయత్‌సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జలమండలి నుంచి హైడ్రాపరిధిలోకి తీసుకొస్తున్నట్లు సీఎస్ తెలిపారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేయడానికి పోలీసు, సర్వే, నీటిపారుదల శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని త్వరితగతిన కేటాయించినట్లు చెప్పారు.






