28 May, 2026 | 2:16 AM

టీం వన్‌కు నోటీసులు

28-05-2026 01:30 AM

రాష్ట్ర హైకోర్టు నూతన భవనసముదాయం నిర్మాణంలో మీ ఆలస్యం వల్లే వ్యయం పెరిగింది

  1. కన్సల్టెంట్ టీం వన్ ఇండియా ప్రై.లిపై ఆర్ అండ్ బీ శాఖ ఆగ్రహం 
  2. కన్సల్టెన్సీ సంస్థ అలసత్వం, నిర్లక్ష్యం, నిస్తేజం వల్లే ఇదంతా!
  3. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్న చీఫ్ ఇంజినీర్ 
  4. డ్రాయింగులు, డిజైన్లను సకాలంలో ఇవ్వలేదంటూ మండిపాటు

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): రాష్ట్ర హైకోర్టు నూతన భవనసముదా యం నిర్మాణ పనులకు సంబంధించి వెల్లువెత్తిన ఆరోపణలు, అవకతవకలకు సంబంధించి ఆర్ అండ్ బీ శాఖ చర్యలకు సమాయత్తమయ్యింది. బాధ్యులపై కఠినంగా వ్యవహరించేందుకు రంగంలోకి దిగింది.

ఇందులో భాగంగా నూతన హైకోర్టు భవనసముదాయం నిర్మాణ ప్రాజెక్టుకు కన్సల్టెన్సీగా నియమించుకున్న టీం వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ జీ రాజేశ్వర్‌రెడ్డి ఈ నెల 20 నోటీసు లు జారీచేశారు. కన్సల్టెన్సీ అలసత్వం, నిర్దేశిత కాలంలోగా డ్రాయిగులు, డిజైన్లు సమర్పించకపోవడం, పనుల పర్యవేక్షణలో అలసత్వం, ఆర్ అండ్ బీ అధికారు లకు సరైన సమాచారం ఇవ్వకపోవడం లాంటి అనేక అంశాలను పేర్కొంటూ.. కన్సల్టెన్సీ సంస్థ టీం వన్ ఇండియా ప్రైలి కు నోటీసులు ఇచ్చారు.

అనేక సాంకేతిక అంశాల్లో కన్సల్టెన్సీ సంస్థ తీవ్ర అలసత్వం వహించిందని పేర్కొంటూ, ఎందుకు చర్యలు తీసుకోకూడదో నిర్దేశిత సమయంలోగా వివరణ ఇవ్వాలని తెలిపారు. దీనినే తుది నోటీసుగా భావించాలని రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ ఘాటుగా రాయడం గమనార్హం. 

కన్సల్టెన్సీగా..

రాజేంద్రనగర్‌లో కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు భవనసముదాయం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్కిటెక్చర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్, ల్యాండ్ స్కేపింగ్ డిజైన్‌తోపాటు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సేవలను అందించడానికి టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆర్ అండ్ బీ సీఈ తెలిపారు. అయితే.. హైదరాబాద్ సర్కిల్ చీఫ్ ఇంజినీరింగ్ అందించిన నివేదిక ప్రకారం.. కన్సల్టెన్సీ సంస్థ అయిన టీం వన్ ఇండియా ప్రై.లి. నుంచి డ్రాయింగులు, వాటికి సంబంధించిన సాంకేతిక వివరాలను అందించడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతోంది.

దీనివల్ల ప్రాజెక్ట్ పురోగతి తీవ్రంగా దెబ్బతింటోంది. ఒప్పందం ప్రకారం.. మీ పనితీరు ప్రాజెక్ట్ షెడ్యూల్‌కు అనుగుణంగా లేదు. దీనితో నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడం కష్టంగా మారింది. ఈ సమస్యలపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (ఈఈ) ఇటీవలి కాలంలో పలు లేఖలు రాశారు. అలాగే  సీఈ కార్యాలయం నుంచికూడా కన్సల్టెన్సీ సంస్థకు నోటీసులు జారీచేసింది. అనేక సార్లు రిమైండర్లు, ఆదేశాలు ఇచ్చినప్పటికీ కన్సల్టెన్సీ తీరులో ఎలాంటి మార్పురాలేదు.

అలాగే.. జోన్-2 భూమి పూజ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి గడువును ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించారు. అయితే మీ సంస్థ వైపు నుంచి నిరంతరం జరుగుతున్న ఆలస్యం కారణంగా, ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్న సమయం సరిపోవడం లేదు. దీనివల్ల ఇచ్చిన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడం కనాకష్టంగా మా రింది. ఏప్రిల్ 24, 2026 నాడు న్యాయమూర్తుల భవన నిర్మాణ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మేయిన్ కోర్ట్ బ్లాక్ ఫౌండేషన్‌కు సంబంధించిన డ్రాయింగ్‌లను ఏప్రిల్ 30, 2026 నాటికి, అలాగే మిగిలిన స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లను 11 మే 2026 నాటికి అందిస్తామని మీరు (కన్సల్టెన్సీ సంస్థ) హామీ ఇచ్చారు. అయినప్పటికీ, పూర్తి వివరాలు లేకుండా.. పాక్షిక ఫౌండేషన్ డ్రాయింగ్‌లను మాత్రమే సమర్పించారు. దీనితో ఈ రోజు వరకు పనులు ప్రారంభించడానికి వీలుపడలేదు.

పైగా సరైన కారణా లు లేకుండానే.. మిగిలిన అన్ని డ్రాయింగ్‌లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇది మీ బాధ్యతారాహిత్యాన్ని స్పష్టంచేస్తోంది. అనేకసార్లు చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన ప్పటికీ.. మేయిన్ కోర్ట్ బ్లాక్‌కు సంబంధించిన ఒరిజినల్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ (ఎస్ బీసీ) ప్రతిని ఇంకా సమర్పించలేదు. అలాగే, మెయిన్ కోర్ట్ బ్లాక్‌కు సంబంధించిన డిజైన్ బేసిస్ రిపోర్ట్ (డీబీఆర్) కూడా పూర్తిగా సమర్పించలేదు. వాటి గురించిన ప్రస్తావనే లేదు.

సేఫ్ బేరింగ్ కెపాసిటీ (ఎస్‌బీసీ)కి సంబంధించిన అంశాలు..

ఈ ప్రాజెక్టు విషయంలో కుదిరిన ఒప్పం దం ప్రకారం.. స్ట్రక్చరల్ డిజైన్లను విడుదల చేయడానికి ముందే (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) దశలోనే ఎస్‌బీసీని నిర్ధారించాల్సి ఉంది. అది మీ సంస్థ (టీం వన్ ఇండియా ప్రై.లి.) ప్రాథమిక బాధ్యత. అంతేకాకుండా, అంచనాల దశలో ఎస్‌బీసీని 30 టన్నులు/ స్కేర్ మీటర్ ఉందని 10.01.2025 నాడు తెలిపారు. దీనితోపాటు భవన సముదాయం లోని వివిధ భవనాలకు సంబంధించి ఎస్‌బీసీని ఒక్కో విధంగా పేర్కొన్నారు. ఇందులో న్యాయమూర్తుల క్వార్టర్ల వద్ద 30 టన్నులు/స్కేర్‌మీటర్ చూపగా.. మేయిన్ కోర్ట్ బ్లాక్ వద్ద 70 టన్నులు/స్కేర్‌మీటర్‌గా చూపెట్టారంటూ, తేదీలతోసహా సీఈ రాసిన లేఖలో ఉద్ఘాటించారు. 

పనులు మొదలైన తరువాత.. సమాచారమా?

క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభమైన తరువాత మీ సంస్థ ఎస్‌బీసీ (సేఫ్ బేరింగ్ కెపాసిటీ) గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపడం గమనార్హం. దీనిపై ఈఈ నుంచి తగిన సమాధానం కూడా ఇచ్చింది. దీనిని బట్టి డీపీఆర్ దశలోనే, స్ట్రక్చరల్ డ్రా యింగ్ విడుదలకు ముందే ఎస్‌బీసీ ని నిర్ధారించడంలో కన్సల్టెన్సీ సంస్థ పూర్తిగా విఫల మైందని స్పష్టమవుతోందని సీఈ లేఖలో పేర్కొన్నారు.

సేఫ్ బేరింగ్ కెపాసిటీ (ఎస్‌బీసీ) నిర్ధారణలో డోలాయమానంగా వ్యవ హరించడం, ఖరారు చేసిన డిజైన్‌లను సమర్పించడంలో ఆలస్యం కారణంగా.. ప్రాజెక్ట్ అమలు, సైట్ వద్ద నిర్ణయాలు తీసుకోవడం లో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని, తద్వారా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేయలేకపోతున్నామని ఆ లేఖలో కారణాలను వివరించారు.

ఇటీవల ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ, మీ లేఖల్లో పేర్కొన్న అంశాలనుబట్టి మీ బాధ్యతరాహిత్యంగా, నిబద్ధత లోపించినట్టుగా కూడా తేటతెల్లం అయ్యింది. హైకోర్టు ప్రాజెక్టుకు సంబంధించి వివిధ వార్తాపత్రికలలో ప్రచురితమవుతున్న కథనాలు సాధారణ ప్రజానీకంలో అనవసరమైన ఆందోళనలు, గందరగోళం, తప్పుడు అభిప్రాయాలను కలిగిస్తున్నట్టు సీఈ రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.

డ్రాయింగు డిజైన్లలో ఆలస్యం..

ఒప్పందం ప్రకారం.. డ్రాయింగ్‌లను ఇ వ్వాల్సిన షెడ్యూల్‌కూడా ముగిసి 8 నెలల కంటే ఎక్కువ కాలం అవుతోంది. అయినా.. మేయిన్ హైకోర్టు బ్లాక్‌లోని అన్ని అంతస్తుల స్ట్రక్చరల్ డ్రాయింగ్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒప్పంద షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే.. అన్ని బ్లాక్‌ల ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్‌లను అందించడానికి దాదాపు 10 నెలల ఆలస్యం జరిగింది. అలాగే అన్ని బ్లాక్ ల స్ట్రక్చరల్ డ్రాయింగ్‌ల సమర్పణలో దా దాపు 8 నెలల ఆలస్యం జరిగింది. అన్ని బ్లాక్‌లకు సంబంధించిన ఎంఈపీ డ్రాయింగ్‌ల ను మీరు ఇంకా సమర్పించలేదు.

అంటే 4 నుండి 6 నెలల ఆలస్యం జరిగింది. కీలకమై న స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లను అందివ్వడంలో తీవ్ర ఆలస్యం కారణంగా ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి నిర్దేశించిన షెడ్యూల్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొ న్నారు. డ్రాయింగులను అందించడంలో విపరీతమైన ఆలస్యం కారణంగా, కాంట్రాక్ట్ సంస్థ నిర్మాణ పనులను పూర్తిచేయడానికి గడువు పొడిగించాలని కోరుతోంది. షెడ్యూ ల్ ప్రకారం కాంట్రాక్టర్‌కు సకాలంలో డ్రా యింగులను సరఫరా చేయనందుకు ఆర్ అండ్ బీ శాఖ తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

డిజైన్లు, డ్రాయింగుల్లోని సందేహాలకు స్పందించకపోవడం..

మెయిన్ కోర్ట్ బ్లాక్‌కు సంబంధించి ఇండిపెండెంట్ ఇంజనీర్ పంపిన అనేక సందేహా లపై ఎలాంటి స్పందన లేదంటూ సీఈ రాసి న లేఖలో స్పష్టంగా తెలిపారు. ఈ సందర్బంగా ఐదు సార్లు ఇండిపెండెంట్ ఇంజ నీర్ పంపించిన లేఖలను, అందులో ఏయే అంశాలపై సందేహాలు వ్యక్తంచేశారనే అంశాలను ఈ సందర్బంగా ఉదహరించారు. పైగా వీటికి సంబంధించిన సమాధానాలు ఇంతవరకు అందలేదని, అందువల్ల మెయిన్ కో ర్ట్ బ్లాక్ యొక్క నిర్మాణ పనులు ఇంకా ప్రా రంభం కాలేదంటూ కారణాలను ఆ లేఖలో వివరించారు.

పరిమాణాల్లో తేడా.. ఈఈ లేఖకు స్పందన శూన్యం..

ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న ఈఈ రాసిన లేఖపైకూడా ఎలాంటి స్పందన లేకపోవడాన్ని ఈ సందర్భంగా ఉదహరించా రు. అడ్మిన్-2, అడ్మిన్ ఎక్స్‌టెన్షన్ బ్లాక్‌ల మధ్య స్టీల్, కాంక్రీట్ పరిమాణాలు అనూహ్యంగా పెరగడానికి కారణాలను తెలపాలం టూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  లేఖ రాసినప్పటికీ.. కన్సల్టెన్సీ సంస్థగా సరైన వివరణ ఇవ్వ డంలో విఫలమయ్యారు.

అలాగే డిసెంబర్ 2025 నుంచి 9.5.-2026 వరకు ప్రతి వారం అన్ని భాగస్వామ్య పక్షాలతో సమీక్షా సమావేశాలలో.. పనుల అమలులో ఆలస్యాన్ని నివారించడానికి అవసరమైన ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ మరియు ఎంఈపీ డ్రాయింగ్‌లను సకాలంలో సమర్పించాలని సూచించాం. అయినప్పటికీ.. సమీక్షా సమావేశాలలో మీ రు ఇచ్చిన హామీలనుకూడా నెరవేర్చలేదు. సహేతుకమైన సమయం ఇచ్చినప్పటికీ.. అనేక నోటీసులు జారీ చేసినప్పటికీ.. మీరు డ్రాయింగులను ఇవ్వడానికి అవుతున్న ఆలస్యాన్ని మాత్రం అధిగమించలేకపోయారం టూ స్పష్టంగా పేర్కొన్నారు.

మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి..

పైన పేర్కొన్న వాస్తవాలు, పరిస్థితుల దృ ష్ట్యా క్రింద పేర్కొన్న అంశాలపై కన్సల్టెన్సీ వివరణ ఇవ్వాలని సీఈ కోరారు.

* ఒప్పందంలోని నిబంధనల ప్రకారం.. మీ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?

* అడ్మిన్-1, అడ్మిన్-1 ఎక్స్‌టెన్షన్, అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ జనరల్ ఎక్స్‌టె న్షన్, అడ్వకేట్ ఛాంబర్లలో పీటీ స్లాబ్స్ నుంచి.. నాన్ పీటీ స్లాబులుగా మార్చడం వల్ల సుమారు రూ. 21 కోట్లకు పైగా అదనపు ఆర్థిక భారం పడింది. దీనికి సంబం ధించి ముందస్తుగా అనుమతి తీసుకోనందుకు నిబంధనల ఉల్లంఘనగా ఎం దుకు పరిగణించకూడదు?

* పైన పేర్కొన్న ఆలస్యాలు, లోపాలు, వాటి పర్యవసానాల వల్ల ప్రభుత్వానికి వాటిల్లిన నష్టాలను ఒప్పందంలోని ని బంధనల ఉల్లంఘనగా ఎందుకు పరిగణించకూడదు?

* కన్సల్టెన్సీ సంస్థగా నిర్ణీత గడువులోగా డ్రాయింగులను సమర్పించక, ప్రాజెక్టు నిలిచిపోయేందుకు కారణమైనందున టీ మ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై ఎందుకు జరిమానాలు విధించకూడదు?

* సహేతుకమైన సమయం ఇచ్చినప్పటికీ అసమర్థత, ఒప్పంద బాధ్యతల ఉల్లంఘన, ప్రాజెక్ట్ షెడ్యూల్‌లను పాటించనం దుకు క న్సల్టెన్సీ సంస్థపై ఎందుకు తగిన చర్యలు తీసుకోకూడదు? అంటూ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 

నోటీసు అందిన తేదీ నుంచి మూడు రోజుల లోపు కన్సల్టెన్సీ సంస్థ సమగ్రంగా వివరణ సమర్పించాలని, గడువులోగా వివరణ ఇవ్వనిపక్షంలో, మీ వద్ద ఎలాంటి సరైన వివరణ లేదని భావించి, ముందస్తు సమాచారం లేకుండానే ఒప్పంద నిబంధనల ప్రకారం సంస్తపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చీఫ్ ఇంజనీర్ పంపించిన నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

నేషనల్ బిల్డింగ్ కోడ్‌కు విరుద్ధంగా..

అడ్మిన్-1, అడ్మిన్-1 ఎక్స్‌టెన్షన్, అడ్మిన్ -2, అడ్వొకేట్ జనరల్ బ్లాక్, అడ్వొకేట్ జనరల్ ఎక్స్‌టెన్షన్, అడ్వొకేట్ ఛాంబర్‌లకు సంబంధించి బేస్ మెంట్ అంతస్తుల ప్లాన్లలో కార్యాలయ స్థలాలు, రికార్డు గదులను కేటాయించారు. బేస్‌మెంట్ ప్రాంతాలలో ఆఫీస్ స్థలాలు, రికార్డ్ గదులను ప్రతిపాదించడం ద్వారా శాఖను తప్పుదోవ పట్టిం చారు. ఇది నేషనల్ బిల్డింగ్ కోడ్--2016 నిబంధనలకు, అగ్నిమాపక శాఖ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.

ఇలాంటి సరికాని, లోపభూయిష్టమైన ప్రణాళిక కారణంగా, నిర్మాణ సంస్థ పనులు ప్రారంభించిన 8 నెలల కాలం తర్వాత.. మీరు బేస్మెంట్ ప్రాంతాల వినియోగాన్ని సవరించి, సుమారు 1,81,000 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని పార్కింగ్ ఏరియాగా మార్చాల్సి వచ్చింది. ఫలితంగా, ఈ తప్పుడు ప్రణాళిక వల్ల ప్రభుత్వానికి భారీ అదనపు ఆర్థిక భారం పడిందంటూ సీఈ రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.

డ్రాయింగ్‌ల ఆలస్యంతో.. ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకులు...

డ్రాయింగ్‌లను అందివ్వడంలో తీవ్ర ఆలస్యం.. ప్రాజెక్టుకు ప్రధాన అ డ్డంకిగా మా రిందని ఆ లేఖలో తెలిపారు. దీనితో.. సైట్ వద్ద పనుల పురో గతి/అమలు పూర్తిగా దెబ్బతిం ది. ప్రధాన స్ట్రక్చరల్ పనుల ప్రారంభ ప్ర ణాళిక పూర్తిగా నిలిచిపోయింది. ప్రా జెక్ట్ అంచ నా వ్యయం అనవసరంగా, అనూహ్యంగా పెరిగింది. చేయాల్సిన పనుల క్రమం తప్పిం ది. మానవ వనరులు, యంత్రా లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనుల అమలు సమయంలో అనివార్యంగా సవరణలు/పునర్విమర్శలు చేయాల్సి వచ్చింది.