17 March, 2026 | 9:27 AM

నోటీసులు కాగితాల్లో.. భవనాలు ఆకాశంలో!

17-03-2026 02:25 AM
  1. మియాపూర్ సర్కిల్లో ‘అక్రమ’ జోరు.. 
  2. అచేతనంగా టౌన్ ప్లానింగ్ విభాగం
  3. అనుమతులు గోరంత.. నిర్మాణాలు కొండంత!

* అనుమతులు గోరంత.. నిర్మాణాలు కొండంత! అధికారులు ఇచ్చే నోటీసులు బుట్టదాఖలు.. అక్రమార్కుల అండదండలతో ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్న అంతస్తులు. ఇది మియాపూర్ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. నగర విస్తరణను ఆసరాగా చేసుకుని నిబంధనలను తుంగలో తొక్కుతూ వెలుస్తున్న అక్రమ కట్టడాలపై మున్సిపల్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శేరిలింగంపల్లి, మార్చి 16 (విజయక్రాంతి): మియాపూర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోం ది. క్షేత్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా, టౌన్ ప్లానింగ్ విభాగం కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటోంది. నోటీసులు ఇచ్చిన తర్వాత సదరు ఫైళ్లను పక్కన పడేయడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. నోటీసుల గడువు ముగిసినా కూల్చివేతలు లేవు, కఠిన చర్యలు అసలే లేవు. దీంతో అక్రమార్కులు భయం లేకుండా నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు.

సాయినగర్ కాలనీలో...

ముఖ్యంగా సాయినగర్‌కాలనీ సర్వే నంబ ర్ 44లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ నిబంధనల అమలు అన్న ముచ్చటే వినిపించడం లేదు. కేవలం స్టిల్ట్ (పార్కింగ్) అనుమతులతో ప్రారంభించి, ఏకంగా 6 నుంచి 7 అంతస్తుల వరకు భవనాలను నిర్మించేస్తున్నారు. అసలు అనుమతులు లేని చోట, ఇంత భారీ నిర్మాణాలు పూర్తి కావస్తు న్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

స్థానికులు వీటిని చూసి ‘ఆకాశానికి నిచ్చెన వేసినట్లున్నాయి‘ అని సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమం లోనూ మియాపూర్ టౌన్ ప్లానింగ్ విభాగంపైనే అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, అనుమతులను మించి అదనపు అంతస్తుల నిర్మాణంపై సామాన్య ప్రజలు విన్నవించుకుంటున్నా, క్షేత్రస్థాయిలో మార్పు మాత్రం శూన్యం.

ఏసీబీ సోదాలూ.. మారని తీరు!

ఇటీవల టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై ఏసీబీ సోదాలు జరిగాయి. ఆ సమ యం లో అధికారులు కాస్త హడావుడి చేసినా, పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. సోదాల భయం కొద్దిరోజులే పరిమితమై, మళ్లీ పాత పద్ధతిలోనే అక్రమ కట్టడాలకు వధూవర పీట లు వేస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. మియాపూర్ సర్కిల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అక్రమ నిర్మాణాల జాబితాను బహిర్గతం చేయాలి.

వెంటనే కూల్చివేతలు చేపట్టి, బాధ్యులైన అధికారులపై విచారణ జరపాలి. లేదంటే ఈ అక్రమ నిర్మాణాలు రేపు పెను ప్రమాదాలకు దారితీస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలే వ్యవస్థను నడిపిస్తున్నాయా? లేక అధికా రులు నిజంగానే చర్యలు తీసుకుంటారా? అన్నది ఇప్పుడు మియాపూర్ వాసుల ముం దున్న ప్రశ్న. ఉన్నతాధికారులు స్పందించి ఈ ‘ఆకాశ హర్మ్యాల’ అక్రమ దందాను అడ్డుకుంటారో లేదో వేచి చూడాలి.