17 March, 2026 | 4:25 AM

పిల్లలకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసుల డేగ కన్ను

17-03-2026 01:58 AM

విద్యాలయాల పరిసరాల్లోని షాపుల్లో నిరంతర తనిఖీలు 

మహబూబాబాద్ మార్చి 16 (విజయక్రాంతి): పిల్లలకు సిగరెట్లు, పాన్లు, ఇతర పొగాకు తయారైన ఉత్పత్తుల విక్రయానికి పోలీసులు అడ్డుకట్ట వేసే కార్యాచరణ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు 18 సంవత్సరాల లోపు వయస్సు గల వారికి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరమని విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు విద్యాలయాల పరిసరాల్లో ఏర్పాటు చేసిన కిరాణా షాపులు, పాన్ షాపుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపులపై జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గా డాక్టర్ శబరీష్ బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లాలో డ్రగ్స్ , గంజాయి చాక్లెట్లు, తదితర మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కు పాదం మోపేందుకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.

అలాగే విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు పాఠశాలలు, కళాశాలల సమీపంలోని కిరాణా షాపులు, టీ స్టాల్స్, పాన్ షాపులు, ఇతర దుకాణాలు, నిర్జీవ ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు చేసి విద్యార్థులకు హానికరమైన వస్తువుల వినియోగం, విక్రయంపై ప్రత్యేక దృష్టి సారించారు.

షాపు యజమానులకు సూచనలు చేస్తూ, కోట్పా ఆక్ట్ 2003 ప్రకారం సెక్షన్ 6(ఎ) ప్రకారం 18 సంవత్సరాల లోపు వయస్సు గల వారికి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరమని సూచిస్తున్నారు. అలాగే సెక్షన్ 6(బీ) ప్రకారం పాఠశాలలు, విద్యాసంస్థల నుండి 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయం చేయడం చట్ట విరుద్ధమని, జేజే యాక్టు 2015 సెక్షన్ 77 ప్రకారం 7 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష తోపాటు లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

అదేవిధంగా  ఎన్ డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం మాదకద్రవ్యాలు (డ్రగ్స్) విక్రయం, నిల్వ, రవాణా లేదా వినియోగం చేయడం తీవ్రమైన నేరమని, అలాంటి కార్యకలాపాల్లో ఎవరైనా పాల్గొంటే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. షాపు యజమానులు తమ దుకాణాల వద్ద ‘18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తుల విక్రయం చేయరాదు’ అనే బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. నిబంధనలు పాటించని దుకాణాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

చెడు అలవాట్ల నిరోధానికి పోలీసుల కృషి

జిల్లాలో విద్యార్థులను మాదకద్రవ్యాలు, ఇతర చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్, పొగాకు ఉత్పత్తుల విక్రయం జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలి. వారు ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాలను తరచుగా గమనిస్తూ ఉండాలి.

పిల్లలు చెడు అలవాట్లకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి బాధ్యత తీసుకోవాలి. జిల్లాలో విద్యార్థులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగిస్తాం. 

డాక్టర్ శబరిష్, ఎస్పీ, మహబూబాబాద్ జిల్లా