18 April, 2026 | 8:57 PM

మల్లెలమడుగులో ఘనంగా పోషణ పక్వాడ కార్యక్రమాలు

18-04-2026 07:55 PM

అశ్వాపురం, (విజయక్రాంతి): అశ్వాపురం మండలం మల్లెలమడుగు రైతు వేదికలో శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 'పోషణ పక్వాడ' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరుగుతున్న ఈ పోషణ పక్వాడ ఉత్సవాల్లో భాగంగా... గర్భిణులకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. అలాగే, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పౌష్టికాహారం ఆవశ్యకతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

​ఇందులో భాగంగా మల్లెలమడుగు రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నలుగురు గర్భిణులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీమంతాలు జరిపారు. అలాగే, ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన, మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మచ్చా నరసింహారావు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పంచాయతీ సెక్రెటరీ జ్యోతి రెడ్డి, సెక్టార్ సూపర్ వైజర్ ధనలక్ష్మి, అశ్వాపురం సెక్టార్ సూపర్ వైజర్ స్వప్న, పోషణ్ అభియాన్ కో-ఆర్డినేటర్ శంకర్, ఏఎన్ఎం లలితకుమారి, సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.