26 June, 2026 | 1:55 AM

దేశంలో 23వ ర్యాంకు సాధించిన ఓద్యారం పాఠశాల

26-06-2026 12:39 AM

గర్వంగా ఉందన్న ఎమ్మెల్యే డా. మెడిపల్లి సత్యం

చొప్పదండి, జూన్ 25 (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలానికి చెందిన జడ్పీహెచ్‌ఎస్ ఓద్యారం SHVR-2025-26 జాతీయ స్థాయి రేటింగ్లో దేశంలో 23వ ర్యాంకు, తెలంగాణలో 5వ ర్యాంకు సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని ఎమ్మెల్యే డా. మెడిపల్లి సత్యం తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం గంగాధర మండలానికే కాకుండా మొత్తం చొప్పదండి నియోజకవర్గానికి గర్వకారణమని, ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తుకు పట్టుకొమ్మల వంటివని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే రేపటి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.

2017-18లో పాఠశాల రాష్ట్ర స్థాయి అవార్డు

సాధించినప్పుడు కూడా తాను ఎంతో సంతోషించానని, ఇప్పుడు అదే పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. జడ్పీహెచ్‌ఎస్ ఓద్యారం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు సమిష్టిగా కృషి చేయడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.

పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, నాణ్యమైన విద్య అందించడంలో పాఠశాల చూపుతున్న కృషి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రతినిధులు పాల్గొన్నారు.