calender_icon.png 11 February, 2026 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్ మున్సిపల్ త్రైవిభజన పూర్తి

11-02-2026 12:14:44 PM

ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ బాధ్యతల స్వీకారం

సైబరాబాద్ కమిషనర్‌గా జి. సృజన, మల్కాజిగిరి కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి

బల్దియా చరిత్రలో నూతన అధ్యాయం

మూడు కార్పొరేషన్లుగా అధికారిక విభజన

హైదరాబాద్, సిటీబ్యూరో,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ చరిత్రలో బుధవారం ఒక కీలకమైన రోజుగా నమోదైంది. ఐదేళ్ల పాటు కొనసాగిన పాలకమండలి పదవీకాలం ముగియడంతో, నగరం అధికారికంగా ప్రత్యేక అధికారి స్పెషలాఫీసర్ పాలనలోకి వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ బుధవారం ఉదయం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే, ప్రభుత్వం నగర పాలనను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ముగ్గురు కమిషనర్లు.. మూడు కార్పొరేషన్లు

నగర విస్తీర్ణం పెరగడం, పరిపాలనా సౌలభ్యం కోసం జీహెచ్‌ఎంసీని మూడుగా విభజించిన ప్రభుత్వం, ఆయా కార్పొరేషన్లకు నూతన కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ హైదరాబాద్: దీనికి కమిషనర్‌గా ఆర్.వి. కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్: నూతనంగా ఏర్పాటైన ఈ కార్పొరేషన్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి జి. సృజన బాధ్యతలు చేపట్టారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్: దీనికి కమిషనర్‌గా టి.వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. బుధవారం ఉదయం స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన జయేష్ రంజన్‌కు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సహా ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.

విభజన వెనుక అసలు వ్యూహం...

ఇటీవలే చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతో జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 2,053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇంతటి భారీ నగరాన్ని ఒకే కేంద్రం నుంచి పాలించడం కష్టమని భావించిన ప్రభుత్వం, అధికార వికేంద్రీకరణ దిశగా ఈ త్రైవిభజన చేపట్టింది. ప్రస్తుతం ఉన్న 300 వార్డులను మూడు కార్పొరేషన్ల పరిధిలోకి సర్దుబాటు చేసే ప్రక్రియ మొదలైంది.

హైదరాబాద్ కేంద్రంగా పాతబస్తీ, సికింద్రాబాద్ ప్రాంతాలు, సైబరాబాద్ పరిధిలోకి ఐటీ కారిడార్, మల్కాజిగిరి పరిధిలోకి ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తానికి, ప్రజాప్రతినిధుల సందడి లేని బల్దియాలో నేటి నుంచి అధికారుల పాలన కొత్త రూపును సంతరించుకుంది. విభజన నిర్ణయంతో నగర ప్రజలకు సేవలు మరింత చేరువవుతాయని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.