కరసగుత్తి ఆసుపత్రిలో అధికారుల ఆకస్మిక తనిఖీ

15-09-2026 | 08:02pm

వైద్య సేవలపై DCHS సీరియస్‌!

ఓపీ పెంచాలి.. సర్జరీలు ప్రారంభించాలి

పేషెంట్లకు మెరుగైన సేవలే లక్ష్యం

నాగలగిద్ద,(విజయక్రాంతి): మండలంలోని కరసగుత్తి గ్రామంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం(Community Health Center) ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిని DCHS డాక్టర్ శ్రీధర్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవలు, పేషెంట్లకు అందుతున్న సౌకర్యాలు, మందుల లభ్యత, పరిశుభ్రత తదితర అంశాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను పరామర్శించి వారికి అందుతున్న వైద్యం, మందులు, భోజనం గురించి ఆరా తీశారు.

ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టాలని, ఓపీ పెంచేలా వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని డాక్టర్ శ్రీధర్ కుమార్ సూచించారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని చిన్నచిన్న సర్జరీలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ ఆసుపత్రి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.పేషెంట్లకు అవసరమైన మందులు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని, మందుల నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.

ఆసుపత్రిలో అడ్మిషన్ పొందిన పేషెంట్లకు నాణ్యమైన భోజనం సమయానికి అందించాలని, వార్డులు, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పేషెంట్‌తో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలను తెలుసుకుని సకాలంలో వైద్యం అందించాలని తెలిపారు.వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని డాక్టర్ శ్రీధర్ కుమార్ స్పష్టం చేశారు. విధులకు ఆలస్యంగా హాజరయ్యే వారు, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెరిగేలా సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు.ఈ తనిఖీలో డాక్టర్ జోయల్, డాక్టర్ వినోద్ కుమార్, నర్సింగ్ ఆఫీసర్లు మౌనిక, శ్రీదేవి, జ్యోత్స్న, శ్రీనివాస్, కరణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు