19 June, 2026 | 4:08 PM

పారుపల్లి లో చెంచు కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాలి

19-06-2026 01:52 PM

పారుపల్లి లో చెంచు కుటుంబాల పరిశీలనలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, జూన్ 19 (విజయక్రాంతి): సంచార జీవులైన చెంచు కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష  ఆదేశించారు. శుక్రవారం ఆయన ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామం, మండల కేంద్రం మరియు ధర్యాపూర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలును పరిశీలించారు.

పారుపల్లి చెంచు గూడెంలో పర్యటన

పారుపల్లి గ్రామంలో నివసిస్తున్న 15 చెంచు కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కలెక్టర్ చొరవ చూపారు. ఇప్పటికే వారికి ఆధార్, రేషన్ కార్డులు మరియు పెన్షన్లను అందించిన ఆయన, తాజాగా కలెక్టర్ ప్రత్యేక నిధులతో నిర్మించిన 10 షెడ్లను (గృహాలను) పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, స్వయంగా విద్యార్థులకు అడ్మిషన్లు అందించారు. అభివృద్ధి పనులపై అధికారులకు అందజేశారు.  పర్యటనలో భాగంగా కలెక్టర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 పాఠశాల పనులు పరిశీలన

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేపడుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని వేగవంతం చేసి, జూలై 31 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తహసీల్దార్ కార్యాలయం తనిఖీ

ముత్తారం మండల కేంద్రంలో జరుగుతున్న తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

 స్థల వినియోగం

ధర్యాపూర్ మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని లెవెలింగ్ చేసి, విద్యా అవసరాలకు ఉపయోగపడేలా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో సురేష్, సంబంధిత శాఖల ఏఈలు, డిఇలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.