కాంగ్రెస్‌కు ఒమర్ అబ్దుల్లా చురకలు
ఈవీఎంలపై అనుమానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయొద్దు
వైఖరి మార్చుకోవాలని హితవు
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఈవీఎంలపై అనుమానాలు ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటాన్ని మానుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ఘాటుగా సూచించారు. జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈవీఎంల ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో 100పైగా సీట్లు సాధించినప్పుడు సంబరాలు చేసుకుని.. కొన్ని నెలల తర్వాత అవే ఈవీఎంల వల్ల ప్రతికూల ఫలితాలు పొందినంత మాత్రాన వాటిపై అనుమానం వ్యక్తం చేయడం సరికాదన్నారు.
ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదన్నారు. ఎన్నికల్లో ఓటమికి వాటిని సాకుగా చూపకూడదని పేర్కొన్నారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో వ్యక్తికి పట్టం కడతారని తెలిపారు. అందుకు తానే ఓ ఉదహరణ అని చెప్పారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓటమి చెందినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు తనకు విజయాన్ని అందించారని తెలిపారు. పక్షపాత ధోరణితో కాకుండా సత్యాసత్యాల నియమాలను అనుసరించి తాను మట్లాడతానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌కు తాను మద్దతు ఇచ్చినట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్త భవన నిర్మాణమనేది అద్భుతమైన ఆలోచన అని ఆయన ప్రశంసించారు.
కాంగ్రెస్ కృషి అంతంత మాత్రమే
పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా పొందిన కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమిలో నాయకత్వాన్ని మరింత బలపర్చుకోవాల్సిన అవసరం ఉందని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అయితే అందుకు చేయాల్సిన కృషిని మాత్రం ఆ పార్టీ చేయడం లేదని అసహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముంగిట బయటకు వచ్చి హడావిడి చేస్తే ఫలితం ఉండదని ఆయన పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా సాధించే విషయంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్ తన గళాన్ని బలంగా వినిపించాలని కోరారు.
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో నాయకత్వ మార్పుపై కూటమి నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన పెద్దగా స్పందించలేదు. కానీ సోనియా గాంధీ నాయకత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇండియా కూటమి ఏర్పడే సమయంలో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై పెరుగుతున్న అసంతృప్తి
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెబుతూ కాంగ్రెస్ తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బహిరంగ విమర్శలు చేశారు. సమాజ్‌వాద్ పార్టీ, శివసేన సహా ఇండియా కూటమిలోని ప్రముఖ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలోనే ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేయడాన్ని ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్ వైఖరిపై ఇండియా కూటమిలోని మిత్ర పక్షాల్లో అసంతృప్తి అంతకంతాకూ పెరుగుతోందని.. ఇకనైనా ఆ పార్టీ తన పద్దతిని మార్చుకోకపోతే మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






