ఓంబిర్లా x సురేశ్
లోక్‌సభ స్పీకర్‌కు ఎన్నిక అభ్యర్థిని నిలిపిన విపక్ష ఇండియా
- స్వతంత్ర భారతంలో తొలిసారి
- ఓంబిర్లాకే మళ్లీ అవకాశమిచ్చిన ఎన్డీయే
- విపక్ష అభ్యర్థిగా కొడికున్నిల్ సురేశ్
- నామినేషన్ వేసిన అభ్యర్థులు
- నేడు ఉదయం 11 గంటలకు పోలింగ్
- ఏకగ్రీవం కోసం జరిపిన చర్చలు విఫలం
న్యూఢిల్లీ, జూన్ 25: ఊహించినట్టుగానే లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ పదవి ఏకగ్రీవం చేసేందుకు అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి నేతలు మంగళవారం జరిపిన చర్చలు విఫలం కావటంతో పోటీ తప్పలేదు. గత లోక్‌సభలో స్పీకర్‌గా పనిచేసిన ఓంబిర్లాకే ఎన్డీయే కూటమి మరోసారి అవకాశమిచ్చింది. ఇండియా కూటమి తరఫున 18వ లోక్‌సభలో అత్యంత సీనియర్ సభ్యుడైన కొడికున్నిల్ సురేశ్‌ను రంగంలోకి దింపింది.
ఈ ఇద్దరు అభ్యర్థులు స్పీకర్ ఎన్నిక కోసం మంగళవారం నామినేషన్లు దాఖలు చేశా రు. బుధవారం ఉదయం 11గంటలకు పోలిం గ్ జరుగుతుంది. దీంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతున్నది. స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కే సురేశ్ మీడి యాతో మాట్లాడారు. ‘ఇది పార్టీ నిర్ణయం. నాది కాదు. స్పీకర్ పదవి అధికార పార్టీకి, డిఫ్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వటం ఆనవాయితీ. అదే విషయాన్న మేం అడిగాం. ఉదయం 11.30 వరకు వేచి చూశాం. కానీ వారి (బీజేపీ) నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అందుకే స్పీకర్ పదవికి నామినేషన్ వేశాం’ అని వివరించారు. విపక్షాల వాదనను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తిప్పకొట్టా రు. డిఫ్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలన్న ఆనవాయితీ ఏమీ లేదని స్పష్టంచేశారు.
ఏకగ్రీవంపై హైడ్రామా
లోక్‌సభ స్పీకర్ పదవిని ఎప్పటిలాగే ఏకగ్రీవం చేసేందుకు అధికార బీజేపీ విపక్ష నేతలతో చర్చలు జరిపింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరెన్ రిజిజు మంగళవారం ఉదయం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇతర కూటమి నేతలతో సమావేశ మై స్పీకర్ ఎన్నికకు మద్దతివ్వాలని కోరారు. అయితే, తమకు డిఫ్యూటీ స్పీకర్ పదవి ఇస్తే, స్పీకర్ ఎన్నికకు మద్దతిచ్చేందుకు అభ్యంతరం లేదని ఖర్గే చెప్పారు. దీంతో వారు ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. మంత్రుల నుంచి ఎలాంటి జవాబు రాకపోవటంతో కే సురేశ్‌ను విక్ష అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే, విపక్ష అభ్యర్థిని పోటీకి నిలుపుతున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ నేతలు రుసరుసలాడుతున్నారు. ఇండియా కూటమిలో టీఎంసీ లేకపోవటం వల్లనే ఆ పార్టీకి సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఓంబిర్లా గెలుపు లాంఛనమే!
లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష కూటముల బలాబలాలను బట్టి చూస్తే అధికార పార్టీ అభ్యర్థి ఓంబిర్లా గెలుపు లాంఛనమే అని తెలుస్తుంది. బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయేకు లోక్‌సభలో 293 మంది ఎంపీలున్నారు. విపక్ష ఇండియా కూటమికి 232 మంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎనీయే నుంచి ఫిరాయించే పార్టీలే కూడా ఏమీ లేవు. దీంతో ఓంబిర్లా గెలుపు ఖాయమే.
గత లోక్‌సభలో డిప్యూటీ ఖాళీ
నరేంద్రమోదీ ప్రధానిగా తొలిసారి పగ్గా లు చేపట్టినప్పటి నుంచి డిఫ్యూటీ స్పీకర్ పద వి విపక్షానికి దక్కకుండా పోయింది. 2014లో ఏర్పడిన 16వ లోక్‌సభలో విపక్షం లేకపోవటంతో డిఫ్యూటీ స్పీకర్ పదవిని అధికార ఎన్డీఏ మిత్రపక్షమైన అన్నా డీఎంకే సభ్యుడు ఎం తంబిదురైకి ఇచ్చారు. లోక్‌సభలో ఒక పార్టీకి విపక్ష హోదా దక్కాలంటే కనీసం 55 మంది ఎంపీలు ఉండాలి. 17వ లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షం హోదా ఏ పార్టీకి దక్కలేదు. దీంతో అసలు డిఫ్యూటీ స్పీకర్ పదవి ఎవ్వరికీ ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కించుకొన్నది. దీంతో గత సంప్రదాయాలను అనుసరించి డిఫ్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
సహకారం అడిగి అవమానిస్తారా?
ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని మోదీ అన్నట్టు ఈ రోజు వార్తాపత్రికల్లో చూశాను. ఈ (మంగళవారం) రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మల్లికార్జున ఖర్గేను కలిసి స్పీకర్ ఎన్నికకు మద్దతివ్వాలని కోరారు. అందుకు మొత్తం ప్రతిపక్షం ఒప్పుకొన్నది. అయితే, సంప్రదాయం ప్రకారం డిఫ్యూటీ స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వాలని కోరాం. ఆ విషయం గురించి ఫోన్‌చేసి చెప్తానని వెళ్లిన రాజ్‌నాథ్‌సింగ్.. చెప్పనేలేదు. ప్రధానేమో సహకారం అని అడుగుతారు. మా నేతలకు మాత్రం అవమానాలు ఎదురవుతున్నాయి’
రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత






