బాస్ పేరుతో కోటిన్నర టోకరా
మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ కేటుగాళ్ల మోసం
మీటింగులో ఉన్నా.. అర్జెంటుగా రూ.1.20 కోట్లు పంపాలంటూ వాట్సాప్ సందేశం
వ్యాపారవేత్త దొడ్ల దివ్యారెడ్డి ప్రొఫైల్‌తో అకౌంటెంట్‌కు బురిడీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 21 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ మనుమరాలు, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త దొడ్ల దివ్యారెడ్డి ప్రొఫైల్‌తో సైబర్ ముఠా ఏకంగా రూ.1.20 కోట్లు కొల్లగొట్టింది. ఆమె పేరుతో అకౌంటెంట్‌కు వాట్సాప్ సందేశం పంపి, పక్కా స్కెచ్‌తో ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు. సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం వెలుగులోకి వచ్చింది.
దొడ్ల దివ్యారెడ్డి సుమారు 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె బిజీ షెడ్యూల్‌ను ఆసరాగా చేసుకున్న నేరగాళ్లు.. ఆమె వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను వాడుతూ అకౌంటెంట్‌కు మెసేజ్ పంపారు. ‘నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన మీటింగులో ఉన్నాను. అర్జంటుగా రూ.1.20 కోట్లు పం పించు’ అని ఒక ఖాతా నంబరును దివ్యారెడ్డి మెసేజ్ చేసినట్లుగా చేశారు. సాధా రణంగా బాస్ నుంచి ఇలాంటి ఆదేశాలు రావడం సహజమేనని భావించిన సదరు అకౌంటెంట్, ఎటువంటి అనుమానం లేకుండా అడిగిన మొత్తాన్ని కేటుగాళ్లు సూచించిన ఖాతాకు బదిలీ చేశారు.
రెండోసారి అడిగితేనే గుట్టురట్టు
మొదటి విడతలో కోటి రూపాయలకు పైగా నగదు చేతికి అందడంతో నేరగాళ్ల ఆశ మరింత పెరిగింది. ఈ నెల 17న మరోసారి అకౌంటెంట్‌కు మెసేజ్ పంపి మరికొంత డబ్బు పంపాలని కోరారు. అయితే, ఈసారి పెద్ద మొత్తం కావడంతో పాటు చెక్ అప్రూవల్ అవసరం పడటంతో అకౌంటెంట్ నేరుగా దివ్యారెడ్డిని సంప్రదించారు. మేడం.. మీరు అడిగినట్లుగా గతంలో రూ. 1.20 కోట్లు పంపించాను.
మళ్లీ ఇప్పుడు పంపమంటున్నారు కదా, చెక్ సంతకం కావాలి అని వివరించారు. అకౌంటెంట్ మాటలు విని దివ్యారెడ్డి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తాను ఎవరికీ, ఎక్కడా డబ్బు పంపమని మెసేజ్ చేయలేదని ఆమె స్పష్టం చేయడంతో.. ఇదంతా సైబర్ నేరగాళ్ల కుట్ర అని తేలిపోయింది. మోసపోయామని గ్రహించిన దివ్యారెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.




