ప్రైవేట్ చదువులు చాలా ఖరీదు!
పాఠశాల విద్యకు ఒక్కో విద్యార్థిపై రూ.38 వేల ఖర్చు
పట్టణ ప్రాంతాల్లో ఇంకా చాలా ఎక్కువే
ప్రభుత్వ బడుల్లో స్వల్పంగా వ్యయం
పీటీఆర్‌లో తెలంగాణ 3వ స్థానం
సామాజిక ఆర్థిక సర్వే నివేదికలో వెల్లడి
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): ప్రైవేట్ చదువులు రోజురోజుకు చాలా ఖరీదు అవుతున్నాయి. తమ పిల్లలకు మంచి స్కూల్ లో చదివించేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు తల్లిదండ్రులు వెనుకాడడంలేదు. ఫీజుల విషయం అస్సలు రాజీ పడటంలేదు. ఇదే విషయాన్ని తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ నివేదిక స్పష్టంచేస్తున్నది. రాష్ట్రం లో ప్రైవేట్ పాఠశాల విద్య చదివించేందుకు ఒక్కో విద్యార్థిపై తల్లిదండ్రులు భారీగా ఖర్చు చేస్తున్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సగటున ఒక విద్యార్థిపై తల్లిదండ్రులు రూ. 38,477 ఖర్చు చేస్తున్నారు. ట్యూషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, డెవలప్‌మెంట్ ఫీజుతోపాటు బుక్స్, స్టేషనరీ, యూనిఫామ్, రవాణా, ప్రైవే ట్ కోచింగ్ కోసం ఇదంతా ఖర్చు పెడుతున్న ట్టు నివేదికలో పొందుపర్చారు. పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే ఒక్కో విద్యార్థిపై రూ. 41,475, గ్రామీణ ప్రాంతాల్లో రూ.35,104 ఖర్చు చేస్తున్నారు.
ఎయిడెడ్ స్కూళ్లలోనూ ఎక్కువే..
రాష్ట్రంలో ప్రైవేట్ బడులు 11,689 ఉండ గా, వీటిలో 37,43,893 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లు 371 ఉండగా.. వీటిలో 59,894 మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లు, యూఆర్‌ఎస్ స్కూళ్లు మొత్తం 24,997 ఉండగా, వీటిలో 19,27,501 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ఎక్కువగానే ఖర్చుచేస్తున్నా రు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో విద్యార్థిపై చేస్తు న్న ఖర్చు రూ.28,420 ఉంటే, పట్టణ ప్రాం తాల్లో రూ.32,951కి చేరింది.
ఈ రెండింటిలో సగటున చూసుకుంటే ఎయిడెడ్ స్కూళ్లలో ఒక్కో విద్యార్థిపై పెడుతున్న ఖర్చు రూ.31, 900గా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సగటున ప్రభుత్వ బడులకు పంపుతున్న వారు ఒక్కో విద్యార్థిపై రూ.2,609 చొప్పున వ్యయంచేస్తున్నారు. కేవలం గ్రామీణ ప్రాంతా ల్లో ఖర్చు చేస్తున్నది రూ.2,286 కాగా, పట్టణ ప్రాంతాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.3,963గా ఉంది. ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలతో పోల్చుకుంటే ప్రభుత్వ బడుల్లో స్కూల్ ఫీజు, ఇతరత్ర ఫీజులేమీ ఉండవు. పైగా ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ ఉచితంగా అందిస్తుండటంతో రాష్ట్రం లో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థిపై చేస్తున్న వ్యయం సహజంగానే తక్కువగా ఉంటుంది.
పీటీఆర్ నిష్పత్తిలో టాప్‌లో తెలంగాణ
విద్యార్థి, టీచర్ రేషియో (టీపీఆర్)లో తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే టాప్‌లోనే ఉంది. నాన్ స్పెషల్ క్యాటగిరీ రాష్ట్రాల్లో తెలంగాణ మూడో ర్యాంక్‌ను సాధించింది. తెలం గాణ సరసన రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలు కూడా నిలిచాయి. 21 మంది విద్యార్థులకు ఒక టీచర్ (21:1) రేషియో ఉంది. జాతీయ సగటు (24:1) కంటే తెలంగాణ సగటు మెరుగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ మనకంటే కింది వరుసలో ఉంది. అక్కడ పీటీఆర్ రేషియో 25:1గా ఉంది. గుజరాత్ 30:1తో కింది నుంచి మూడోస్థానంలో ఉండగా, బీహార్ కింది నుంచి రెండో స్థానం, జార్ఖండ్ 36:1తో చిట్టచివరన నిలిచింది.
రూరల్‌లో సర్కారు బడులకే మొగ్గు
రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువగా చదివిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో 63.6 శాతం మంది చదువుతుండగా, ఎయిడెడ్ పాఠశాలల్లో 4.5 శాతం, ప్రైవేట్ బడుల్లో 31.6 శాతం మంది చదువుతున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వబడుల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటంలేదు. సర్కారు బడుల్లో 23 శాతం కాగా, ఎయిడెడ్ స్కూళ్లలో 22.8 శాతం ఉండగా, ప్రైవేట్ బడుల్లో అత్యధికంగా 54 శాతం మంది చదువుతున్నారు.




