రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్!
- అక్కడి నుంచే ఆయా పాఠశాలలకు ఆహారం సరఫరా
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌కు ప్రభుత్వం చర్యలు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలనే దిశగా సర్కారు చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమావేశం కానున్నారు. అయితే రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అక్కడి నుంచే ఆయా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు ఆహారం సరఫరా చేయనున్నారు. అయితే దీన్ని తొలుత దశలవారీగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కింద ఆహారం సరఫరా బాధ్యతలను మన్నా ట్రస్ట్, అక్షయపాత్రకు అప్పగిస్తున్నారు. ప్రీప్రైమరీ నుంచి పదో తరగతి విద్యార్థులకు దీన్ని అమలు చేయనున్నారు.
ప్రీప్రైమరీ చదివే ఒక్కొ విద్యార్థికి రూ.11 చొప్పున, హైస్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.13 చొప్పున ఇందుకు ఖర్చు చేయనున్నారు. అయితే మన్నా ట్రస్ట్, అక్షయపాత్రలకు ఇప్పటికే కిచెన్ షెడ్స్ ఉన్న జిల్లాల్లో తొలుత ఈ స్కీమ్‌ను ప్రారంభించి, తర్వాత మిగతా జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. కిచెన్ షెడ్స్ నిర్మాణం కోసం జిల్లాల్లో స్థలాలను గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది. ఒక్కో సెంట్రలైజ్డ్ కిషెన్ ఏర్పాటుకు 1.5 ఎకరాల నుంచి 2 ఎకరాల స్థలాల్లో వీటిని నిర్మించనున్నారు. అయితే ఈ స్థలాలను ప్రభుత్వం ఆయా ట్రస్టులకు లీజ్‌కు ఇవ్వనుంది.




