30 May, 2026 | 3:07 PM

డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీకి భూమి కేటాయించవద్దు

30-05-2026 03:07 PM

టీజీఐఐసీ చైర్ పర్సన్ టి.నిర్మల జగ్గారెడ్డికి ఎమ్మెల్యే శంకర్ వినతి

షాద్ నగర్,(విజయక్రాంతి): కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం జీహెచ్‌ఎంసీకి భూమి కేటాయించవద్దని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) చైర్ పర్సన్ టి.నిర్మల జగ్గారెడ్డికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వినతి పత్రం అందజేశారు. శనివారం (టీజీఐఐసీ) చైర్ పర్సన్ టి.నిర్మల జగ్గారెడ్డినీ  కలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ సిద్దాపూర్ డంప్ యార్డ్ ఏర్పాటు సమస్యను ఆమెకు కూలంకుశంగా వివరించారు.

షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం, సిద్దాపూర్ గ్రామంలో గల సర్వే నంబర్లు 252, 278 మరియు 361 గల 330- 34 గుంటల ఎకరాల ప్రభుత్వ భూమిని, పారిశ్రామిక పార్కును స్థాపించడం కోసం టీజీఐఐసీ ఇప్పటికే సేకరించినట్లు వారి దృష్టికి ఎమ్మెల్యే తీసుకువచ్చారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 సమీక్షా సమావేశంలో, షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం, సిద్దాపూర్ గ్రామంలో ఒక ఎకో టౌన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారనే వార్త మన నియోజకవర్గంలో ప్రచారంలో ఉందనీ ఈ ఎకో టౌన్ ఏర్పాటు కోసం సదరు భూమిని జీహెచ్‌ఎంసీకి కేటాయించేందుకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని కూడా తెలిసింది.

 వలయాకార ఆర్థిక వ్యవస్థ, రీసైక్లింగ్ మరియు విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుల పేరిట ఈ ప్రాంతంలో ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, ద్రవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు, రీసైక్లింగ్ ప్లాంట్లు మరియు ఇతర సంబంధిత సౌకర్యాలను ఏర్పాటు చేస్తారేమోనని సిద్దాపూర్ మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన, భయం వ్యక్తం చేస్తున్నారనీ, ఎకో టౌన్ ప్రాజెక్టుకు బదులుగా, మొదట ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్క్‌నే ప్రభుత్వం కొనసాగించాలని సిద్దాపూర్ మరియు సమీప గ్రామ ప్రజలు గట్టిగా కోరుతున్నారనీ ఆమె దృష్టికి తీసుకువెలి ఎమ్మెల్యే శంకర్ వినతిపత్రం సమర్పించారు. దీనిపై చైర్ పర్సన్ కూడా సానుకూలంగా స్పందించారనీ  ఎమ్మెల్యే శంకర్ వివరించారు.