ఎగ్జిట్ పోల్స్‌పై కన్ను.. పతనానికి బ్రేక్
న్యూఢిల్లీ, మే 31: గత ఐదు రోజులుగా జరిగిన వరుస పతనానికి శుక్రవారం బ్రేక్ పడింది. జూన్ 1న వెలువడనున్న లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్‌పై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు కొన్ని రంగాల షేర్లను విక్రయించి, మరికొన్ని రంగాల షేర్లను కొనుగోలు చేశారు. ఈ తరహా పోర్ట్‌ఫోలియో మార్పిడి జరగడంతో శుక్రవారం రోజంతా స్టాక్ సూచీలు పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 668 పాయింట్ల నష్టంతో 75,000 స్థాయిని కోల్పోయి 74,503 పాయింట్ల వద్ద ముగిసింది.
74,478 పాయింట్ల గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్య ఊగిసలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 76 పాయింట్ల లాభంతో 73,961 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేరీతిలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22,650 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై చివరకు 42 పాయింట్లు లాభపడి 22,530 పాయింట్ల వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఇటీవలి రికార్డు గరిష్ఠస్థాయి 76,009 పాయింట్ల నుంచి 2,100 పాయింట్లకుపైగా పతనమైన సంగతి తెలిసిందే. నిఫ్టీ 23,100 పాయింట్ల గరిష్ఠస్థాయి నుంచి 600 పాయింట్లకుపైగా ఈ వారం తొలి నాలుగు రోజుల్లో పడిపోయిన విషయం విదితమే.
బ్యాంకింగ్‌లో కొనుగోళ్లు.. ఐటీ, ఎఫ్‌ఎంసీజీలో అమ్మకాలు
శుక్రవారంనాటి మార్కెట్లో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరగ్గా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో విక్రయాలు జోరుగా సాగాయి. సెన్సెక్స్ బాస్కెట్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, లార్సన్ అండ్ టుబ్రో, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 0.50 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు నెస్లే ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్‌లు 2 శాతం వరకూ తగ్గాయి.
వివిధ రంగాల సూచీల్లో అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 2.10 శాతం పెరిగింది. రియాల్టీ ఇండెక్స్ 2.02 శాతం, పవర్ ఇండెక్స్ 1.80 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.60 శాతం, మెటల్ ఇండెక్స్ 1.28 శాతం, టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 1.18 శాతం చొప్పున పెరిగాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.99 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.84 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.55 శాతం, ఆటోమొబైల్ సూచి 0.32 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.21 శాతం చొప్పున తగ్గాయి. స్మాల్ క్యాప్ సూచి 0.76 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.






