22 August, 2026 | 4:21 PM

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

22-08-2026 03:47 PM

సదాశివనగర్, ఆగస్టు 22(విజయక్రాంతి): ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి డిజిటల్ మోసాల బారిన పడకుండా ఉండాలని, ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాస్ రావు అన్నారు.ఈ మేరకు శనివారం మండలంలోని పద్మాజీవాడి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ,చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నారని, వీటిని అరికట్టడానికి పోలీసు శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తుందని, ప్రజలు కూడా డిజిటల్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ఉండడానికి మొబైల్ ఫోన్లో ఎలాంటి లింకులను ఓపెన్ చేయవద్దని, అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే వీడియో కాల్స్ ను రిసీవ్ చేయద్దని సూచించారు. సైబర్ నేరాల బారిన పడిన వారు గంట లోపల 1930 ఫోన్ చేసి సమాచారం అందించాలని, లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలని, మత్తు వల్ల కలిగే అనర్ధాలను విద్యార్థులకు వివరించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, పోలీసులు తమ బాధ్యతలో భాగంగానే తనిఖీలు చెపడుతూన్నామని అన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ గౌడ్, ఎస్సై పుష్ప రాజ్, స్థానిక సర్పంచ్ సుబ్బారావు, ఉప సర్పంచ్ శేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.