2 August, 2026 | 9:28 AM

1.23 కోట్ల గంజాయి పట్టివేత

28-05-2024 12:05 AM

భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (విజయక్రాంతి): వేర్వేరు చోట్ల పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు సినీ ఫక్కిలో పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యాన్‌లో భారీగా గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందింది. కొత్తగూడెం 3వ పట్టణ ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి పాత ఆర్టీసీ డిపో వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానస్పదంగా కనిపించిన వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వ్యాన్ క్యాబిన్ వెనుక అనుమానం రాకుండా సమాంతరంగా తయారుచేసిన భాగంలో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. రూ.1.23 కోట్ల విలువైన దాదాపు 4.92 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన శుభమ శరత్ బండారీ, అంజత్ అబ్దుల్ షేక్ ఏపీలోని సీలేరుకు చెందిన రాజు నుంచి గంజాయిని కొనుగోలు చేసి షోలాపూర్‌కు చెందిన యోగేశ్ వద్దకు తీసుకెళ్తున్నారు. గంజాయిని విక్రయించిన రాజు, తీసుకురమ్మని పురమాయించిన యోగేశ్‌తోపాటు పట్టుబడిని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు సీఐ శివప్రసాద్ తెలిపారు.

సికింద్రాబాద్‌లో ఐదుగురి అరెస్టు 

గంజాయి విక్రేతలు రవాణాకు కొత్తమార్గం ఎంచుకున్నారు. రోడ్డుమార్గంలో వెళ్తే పోలీసులకు పట్టుబడతామని భావించి రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సోమవారం గంజాయి పట్టుబడ్డ ఘటన కలకలం రేపింది. ఒడిశా నుంచి నాందేడ్ వెళ్తున్న రైళ్లో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద 62 కిలోల గంజాయిని పట్టుకుని, సీజ్ చేశారు. దాని విలువ రూ.15 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.