పంట వ్యర్థాల కాల్చివేత పర్యావరణానికి ముప్పు
వరంగల్, మే 2౭ (విజయక్రాంతి): పంట చేతికొచ్చిన తర్వాత వ్యర్థాలను తొలగించే క్రమంలో వాటిని కాల్పడం పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ రాజు తెలిపారు. కొందరు రైతులు పంట కాలం తర్వాత రైతులు వ్యర్థాలను కాల్చివేస్తుంటారని, అలా చేస్తే నష్టాలు ఉన్నాయన్నారు. ఒక పంట తర్వాత వ్యర్థాలను కలియదున్నితే, మృత్తికలో కర్బన శాతం పెరుగుతుందని, తద్వారా భూమి సారవంతమవుతుందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 500 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు వెలువడుతుండగా, తెలంగాణలో 29 మిలియన్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయన్నారు. వ్యర్థాలను కాలిస్తే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అమోనియం వంటి విష వాయువులు వాతావరణంలో కలుస్తాయన్నారు. తద్వారా వాయుకాలుష్యం పెరిగి ప్రాణులకు హాని కలుగుతుందన్నారు.
-కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ రాజు






