పాలమూరు నేతలను చూసి జాలిపడాలి..!
నల్గొండకు నీళ్లు తరలిస్తుంటే పాలమూరుకు ఏం కావాలి?
నాగర్ కర్నూల్ ( విజయక్రాంతి): పాలమూరు ప్రాంత హక్కులను కాపాడుకునేందుకు న్యాయమైన లక్ష్యంతో జలసాధన ఉద్యమాన్ని గ్రామం గ్రామాన కొనసాగించాలని జలసాధన సమితి జేఏసీ కో-చైర్మన్(JAC Co-Chairman) రాఘవచారి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ ప్రాంగణంలో ఉమ్మడి పాలమూరు జలసాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష పెట్టారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని ముఖ్య జేఏసీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా రాఘవాచారి మాట్లాడుతూ కరువు నేలగా పేరుందిన ఈ ప్రాంతానికి ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ చేస్తున్నారు తప్ప ఈ ప్రాంతానికి నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
పాలమూరు ప్రాజెక్టు నుండి నల్గొండ ప్రాంతానికి నీటిని తరలిస్తుంటే పాలమూరు ప్రాంతానికి ఏం కావాలని వారు ప్రశ్నించారు. కృష్ణా నదిపై పాలమూరు ప్రజలకు హక్కు ఉందని, ఉమ్మడి పాలమూరు ప్రాంత ముంపు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తే ఆ ఘనతను నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు.
నీళ్లు నిధులు నియామకాల లక్ష్యంతో తెగించి పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ ప్రాంతానికి నీటి కోసం, హక్కుల కోసం మరోసారి పోరాడాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జలసాధన ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రవల్లి ముంపు నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ 285 రోజులుగా కొనసాగుతున్న నిరసనను ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాంత సమస్యలపై ప్రజలు, రైతులు ఐక్యంగా పోరాడాలని కోరారు.