విద్యతోపాటు సామాజిక అంశాల్లో అవగాహన కలిగి ఉండాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
మహబూబాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): విద్యతోపాటు సామాజిక అంశాలపై విద్యార్థిని, విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం సంక్షేమ వారోత్సవాలను నేపథ్యంలో రెండవ రోజు మహబూబాబాద్ పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహంలోని స్టోర్ గది, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ రోజు కిచెన్ క్లీనింగ్, సానిటేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, పరిసరాల పరిశుభ్రత, హెల్మెట్, సీట్ బెల్ట్, రోడ్డు భద్రత, డ్రగ్స్ నివారణ తదితర అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించారు.
సంక్షేమ పాఠశాలలో విద్యార్థుల యొక్క ప్రతిభను సృజనాత్మకతలను వెలికి తీయడం మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలు, వివిధ సబ్జెక్టులలో జ్ఞానాన్ని, శీఘ్ర ఆలోచనా విధానాన్ని పరీక్షించడం కోసం క్విజ్ పోటీలు, బాలల హక్కుల కార్యక్రమాలు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, పట్టుదల ఏకాగ్రతతో విద్యనభ్యసించాలని, అలాగే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలను సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, కళాశాల ప్రిన్సిపల్ రాజేష్ పాల్గొన్నారు.






