29 August, 2026 | 3:19 AM

579కి చేరిన మృతుల సంఖ్య

29-08-2026 02:12 AM

320 మంది భారతీయుల కోసం కొనసాగుతున్న రెస్క్యూ

మరోసారి వరద హెచ్చరికలు జారీ

భయం గుప్పిట్లో ప్రజలు

కాట్మాండు, ఆగస్టు 28: నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన వినాశకరమైన వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 57౯ మంది ప్రాణాలు కోల్పోగా, చైనా వైపున కూడా ఐదుగురు మరణించారు. రెండు దేశాల సరిహద్దుల్లో కలిపి సుమారు 1,500 మందికి పైగా గల్లంతయ్యారు.

గడచిన పదేళ్ల కాలంలో 2015 భూకంపం తర్వాత నేపాల్‌ను ముంచెత్తిన అత్యంత ఘోరమైన విపత్తు ఇదే కావడం గమనార్హం. మంచు కొండలు (గ్లేసియర్) ఉన్నట్టుండి కూలిపోవడంతో ఒక్కసారిగా హిమపాతం ఏర్పడి భీకర వరద ప్రవాహానికి దారితీసిందని భూగర్భ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. చైనా వైపు ఉన్న డ్యామ్ బద్దలవ్వడంతో నేపాల్ పోలీసులు దిగువ ప్రాంత ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. నదీ తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, శిథిలాలు పేరుకుపోవడం వల్ల సహాయక బృందాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ విపత్తులో చిక్కుకున్న భారతీయ పౌరుల భద్రతపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అందించిన వివరాల ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న 21 మంది భారతీయులను కాట్మాండు నుంచి సురక్షితంగా ఢిల్లీకి తరలించారు.

అంతేకాకుండా, త్రిశూలి హైడ్రోపవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ కార్మికులను భద్రతా బలగాలు కాపాడాయి. చైనా సరిహద్దు ప్రాంతంలో చిక్కుకున్న మరో 96 మంది భారతీయులు కూడా నేపాల్‌కు సురక్షితంగా చేరుకున్నారు. అయితే, ఇప్పటికీ 320 మంది భారత పౌరులతో పాటు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ లభించాల్సి ఉంది. మరో 400 మంది చైనా వైపు చిక్కుకుపోయారని ఎంఈఏ శుక్రవారం తెలిపింది.వారితో సంబంధాలు పునరుద్ధరించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

మరోసారి వరద హెచ్చరికలు..

నేపాల్లో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వరద బాధితులకు మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. చైనా వైపు కొండచరియలు, శిథిలాలు అడ్డుపడటం వల్ల ఏర్పడిన కృత్రిమ సరస్సు ఏ క్షణమైనా బద్దలయ్యే ప్రమాదం ఉందని అధికారుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. దీనివల్ల దిగువన ఉన్న నేపాల్‌లోని బోటేకోషి, త్రిశూలి నదీ ప్రాంతాలకు మరోసారి భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందంటున్నారు.

ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు నదీ తీరాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆదేశించారు. శిథిలాలు, వరద నీరు ఒకేసారి విరుచుకుపడే అవకాశం ఉండటంతో భద్రతా బలగాలు సహాయక చర్యలను మరింత అప్రమత్తంగా కొనసాగిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు.

భారత్ బాసట..

నేపాల్‌లో సంభవించిన విపత్తులో భారత్ మరోసారి తన ఉదారతను చాటుకుంటోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు సహాయం అందించడంలో భారత్ ‘ఫస్ట్ రెస్పాండర్’గా నిలిచింది. చైనా, అమెరికా వంటి దేశాలు ఇంకా సహాయ చర్యలను సిద్ధం చేస్తున్న సమయంలోనే న్యూఢిల్లీ వేగంగా స్పందించింది. ఆహారం, ఔషధాలతో కూడిన సహాయక సామగ్రిని ప్రత్యేక విమానంలో నేపాల్ తరలించింది.

గతంలో కోవిడ్ టీకాల పంపిణీతో పాటు టర్కీ, మయన్మార్, శ్రీలంక, వెనిజులా దేశాల్లో విపత్తులు వచ్చినప్పుడు భారత్ ఇలాగే తక్షణమే స్పందించింది. బుధవారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘోర ప్రమాదంపై తీవ్ర సంతాపం తెలిపారు. నేపాల్‌కు అవసరమైన అన్ని రకాల మానవీయ సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా స్పందిస్తూ.. భారత్ ఎల్లప్పుడూ నేపాల్ ప్రజలకు అండగా ఉంటుందని ప్రకటించారు. భారత్ శుక్రవారం మధ్యాహ్నం నాటికి మొత్తం 62 టన్నుల సహాయక సామగ్రిని నేపాల్‌కు చేరవేసింది. ఇందులో అత్యవసర మందులు, ఆహార పొట్లాలు ఉన్నాయి. ఇతర దేశాలు సహాయం ప్రకటించే లోపే భారత్ క్షేత్రస్థాయికి సహాయక సామగ్రిని పంపించి తన వేగాన్ని నిరూపించుకుంది. చైనా, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికా, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్ కూడా సహాయం అందిస్తామని ప్రకటించాయి. కానీ భారత్ అందించిన వేగవంతమైన సహాయం అందరి దృష్టిని ఆకర్షించింది.