29 August, 2026 | 3:19 AM

‘ఆర్‌ఎంఎస్’ విధానంతో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్వహణ

29-08-2026 12:00 AM

ఆపరేటర్ రహిత విద్యుత్ సబ్ స్టేషన్ కేసముద్రం

దశలవారీగా ఆపరేటర్ల వ్యవస్థకు మంగళం

మహబూబాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఎన్ పీ డీ సీ ఎల్ సంస్థ నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్వహణలో ఆపరేటర్లకు బదులు మానవ రహిత నిర్వహణ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఆపరేటర్లకు బదులు ఇకనుంచి విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్వహణను కమాండ్ కంట్రోల్ ద్వారా రిమోట్ మానిటరింగ్ సిస్టం (ఆర్ఎంఎస్) పర్యవేక్షిస్తారు. ఇందుకోసం జిల్లా కేంద్రంతోపాటు ఎన్ పీ డీ సీ ఎల్ సంస్థ కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేశారు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో నూతనంగా నిర్మించి త్వరలో ప్రారంభించే 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో ఆర్ ఎం ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే జిల్లాలో గార్ల, పత్తిపాక విద్యుత్ ఉప కేంద్రాల్లో ఇదే విధానాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాలోని ఆపరేషన్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ఆయా విద్యుత్తు సబ్ స్టేషన్ల నిర్వహణను పరిశీలించడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు.

ఆర్‌ఎంఎస్ విధానం అమలు చేసే సబ్ స్టేషన్లలో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆధారంతో ఆయా సబ్ స్టేషన్ల పనితీరును ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ తోపాటు కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిరంతరాయంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకున్నారు. గతంలో మూడు షిఫ్టుల్లో ఆపరేటర్లు విద్యుత్తు సబ్స్టేషన్ నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తుండగా, ఆర్ ఎం ఎస్ విధానం అమలు చేసే విద్యుత్ సబ్ స్టేషన్ లో ఇక ఆపరేటర్లతో ఏలాంటి అవసరం ఉండదు.

పూర్తిగా ఆన్లైన్ విధానంలో సబ్ స్టేషన్ నిర్వహణ చూస్తారు. సబ్ స్టేషన్ లో ఏదైనా అంతరాయం ఏర్పడి విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించి ఆ సబ్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేసి సబ్ స్టేషన్ వద్దకు పంపి, సాంకేతిక లోపాన్ని పునరుద్ధరింప చేయడానికి చర్యలు తీసుకుంటారు. కమాండ్ కంట్రోల్ తో పాటు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ కు నలుగురు విద్యుత్తు అధికారుల సెల్ ఫోన్ నంబర్లను అనుసంధానించి, ఎప్పటికప్పుడు విద్యుత్తు సబ్ స్టేషన్ లో సాంకేతిక సమస్య తలెత్తితే పునరుద్ధరించే విధంగా తగిన చర్యలు చేపట్టారు.

దీనితో భవిష్యత్తులో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణకు ఆపరేటర్ల అవసరం లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా నిర్మించిన, నిర్మించ తలపెట్టిన విద్యుత్ సబ్స్టేషన్ల లో ఈ నూతన ఆర్‌ఎంఎస్ విధానం అమలు చేస్తున్నారు. అయితే ఆర్‌ఎంఎస్ విధానం అమలు చేయడానికి ప్రస్తుతం నెట్వర్క్ సమస్య తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. నెట్వర్క్ సమస్య తలెత్తకుండా సమర్థవంతంగా చర్యలు తీసుకుంటే ఈ విధానం పటిష్టంగా అమలు చేయడానికి సులువవుతుందని చెబుతున్నారు.

మూడు సబ్ స్టేషన్లలో ఆర్‌ఎంఎస్ విధానం అమలు

మహబూబాబాద్ జిల్లాలోని మూడు కొత్త సబ్ స్టేషన్లలో నూతన ఆర్‌ఎంఎస్ విధానం ప్రవేశపెట్టాం. ఇందుకోసం ఆయా సబ్ స్టేషన్లలో ఒక్కో సబ్ స్టేషన్ లో 12 చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అలాగే జిల్లా కేంద్రంలోని డీఈ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. సబ్ స్టేషన్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ తోపాటు కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కు కూడా అనుసంధానం చేసాం.

సబ్ స్టేషన్ లో ఎక్కడ సాంకేతిక సమస్య ఏర్పడిందనే తెలుసుకునే విధంగా ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధానం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆర్.ఎం.ఎస్ విధానం అమలు వల్ల పర్యవేక్షణ మరింత పెరగడం వల్ల సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

-ఏ.కోటేశ్వరరావు, డీ.ఈ, 

(ఆపరేషన్) మహబూబాబాద్