ఆర్టీసీ ‘స్పెషల్’ దోపిడీ!
* స్టిక్కర్ వేసి.. ప్రయాణికుల జేబులకు చిల్లు!
* రెగ్యులర్ బస్సుకే ‘రాఖీ స్పెషల్’ ముసుగు..
* అదనపు చార్జీల బాదుడు
రంగారెడ్డి, ఆగస్టు 28 (విజయక్రాంతి): పండుగ వచ్చిందంటే చాలు.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాల్సిన తెలంగాణ ఆర్టీసీ, ప్రయాణికుల అవసరాన్ని ఆదాయ వనరుగా మార్చుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాఖీ పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ‘స్పెషల్’ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తోంది. వింత ఏమిటంటే.. పండుగ కోసం కొత్తగా అదనపు బస్సులు వేయకుండా, రోజూ తిరిగే రెగ్యులర్ బస్సులకే ‘రాఖీ స్పెషల్’ అని స్టిక్కర్లు అంటించి ప్రయాణికులపై 1.5 రేట్ల అదనపు చార్జీల భారాన్ని మోపుతున్నారు.
* రోజూ తిరిగే బస్సే.. కానీ టికెట్ ధర డబుల్...
బస్సు అదే, డ్రైవర్-కండక్టర్ అదే, రోజూ తిరిగే రూట్ కూడా అదే.. కానీ బస్సు బోర్డుపై ఒక ‘స్పెషల్’ స్టిక్కర్ మారగానే టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
* హైదరాబాద్ - కరీంనగర్.... సాధారణ రోజుల్లో రూ. 290 చార్జీ ఉండగా, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులలో ‘1:50’ నిబంధన పేరుతో అదనంగా రూ. 100 నుంచి రూ. 150 వరకు పిండుతున్నారు. దీంతో ప్రస్తుతం టికెట్ ధర రూ. 400కు చేరింది.
మహబూబ్‌నగర్ - హైదరాబాద్: సాధారణ చార్జీ రూ. 160 కాగా, స్పెషల్ ముసుగులో రూ. 220 వసూలు చేస్తున్నారు.
షాద్‌నగర్ - హైదరాబాద్: సాధారణ చార్జీ రూ. 80 కాగా, స్పెషల్ పేరుతో రూ. 30 వరకు అదనంగా గుంజుతున్నారు.
మార్గమధ్యంలో షాక్.. జర్నలిస్టులకూ తిప్పలు
సాధారణ సర్వీసులు దొరక్క వేరే దారి లేక బస్సు ఎక్కిన ప్రయాణికులకు మార్గమధ్యంలో కండక్టర్లు అదనపు చార్జీల టికెట్లు తీస్తూ షాక్ ఇస్తున్నారు. మరోవైపు స్పెషల్ బస్సుల్లో జర్నలిస్టులకు వర్తించే '1/3 వంతు చార్జీ' నిబంధన చెల్లదని సిబ్బంది తేల్చిచెబుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు పొంతన లేని సమాధానాలు ఇస్తూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
* మహిళలకు ఫ్రీ.. పురుషులపైనే బాదుడా?
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం, ఆ భారాన్ని సర్దుబాటు చేసుకోవడానికే పురుష ప్రయాణికులపై ఈ స్థాయిలో చార్జీల కొరడా ఝుళిపిస్తోందా అని ప్రయాణికులు మండిపడుతున్నారు. "ఒకరికి ఫ్రీ అని చెప్పి.. మరొకరి జేబులు ఖాళీ చేయడం ఏ రకమైన న్యాయం?" అని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం సమాధానం చెప్పాలి... పలువురు ప్రయాణికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
పండుగ రద్దీని క్యాష్ చేసుకుంటూ సాగుతున్న ఈ 'స్పెషల్' బాదుడుపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అసలు పండుగ పేరుతో ఎన్ని అదనపు సర్వీసులు నడిపారు? అందులో రెగ్యులర్ బస్సులు ఎన్ని? ఏ నిబంధనల ప్రకారం రోజూ తిరిగే బస్సులను 'స్పెషల్'గా మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతున్నారు. కేవలం స్టిక్కర్లు మార్చి అదనపు చార్జీలు వసూలు చేసే విధానానికి వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు.






