కొనసాగుతున్న ఎల్లో అలర్ట్
మరో నాలుగు రోజులు వర్షాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి): రానున్న మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగింది. హైదరాబాద్‌లోని పలు ప్రాం తాల్లో సాధారణ వర్షం కురిసింది. ప్రజలు అత్యవసరమైతే 040 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని జీహెచ్‌ఎంసీ తెలిపింది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి రాష్ట్రంలోని మెదక్, భద్రాచలం మీదుగా వెళ్తున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
పిడుగుపడి ఇద్దరు మృతి
కౌడిపల్లి/కామారెడ్డి, జూన్ 7: మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో పిడుగు పడి బోయిని నర్సమ్మ (48) మృతిచెందింది. పొలం పనులకు వెళ్లి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లోని గోవర్గల్ గ్రామంలో శుక్రవారం రాత్రి పిడుగుపా టుకు కురుమ కృష్ణమూర్తి (౨౨) మృతి చెందాడు.
మూగ జీవాలు మృత్యువాత..
రంగారెడ్డి/వికారాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు బ్లాక్ మండలాలు, షాద్‌నగర్, చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. షాద్‌నగర్‌లోని దేవుని మామిడిపల్లిలో పిడుగుపాటుకు రైతు బోద్ద శంకరయ్యకు చెందిన ౪ గొర్రెలు, ౪ మేకలు మృతిచెందగా, ఆమనగల్లు మండలంలోని గౌరారంలో నిట్ట పర్వతాలుకు చెందిన రెండు ఆవులు, దావ శ్రీనుకు చెందిన ఆవు మృతిచెందాయి. అదే విధంగా వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం లింగన్నపల్లి గ్రామంలో అలకుంట లాల్ అనే రైతుకు చెందిన ఐదు గేదెలు పిడుగుపాటుతో మృత్యువాత పడ్డాయి.
నాలుగు రోజులు..
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. శనివారం మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురుస్తుందని, ఆదివారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం, సోమవారం కొన్నిచోట్ల తేలికపాటి వర్షం పడుతుందని వెల్లడించారు.






