14 August, 2026 | 4:32 PM

ఎమ్మెల్సీ పోలింగ్‌కు మూడు రోజులే..

25-05-2024 01:08 AM

యాదాద్రి భువనగిరి, మే 24 (విజయక్రాంతి): వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్‌కు మూడు రోజుల గడువు ఉంది. ఈ నెల 27న ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. దీంతో అభ్యర్థు లు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. మరోవైపు స్వేచ్ఛగా, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాగం పకడ్బందీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుచుకోవ డానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, స్వతంత్ర అభ్యర్థి బక్కా జడ్సన్‌తో పాటు 52 మంది పోటీ పడుతున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు మద్దతుగా పార్టీ క్యాడర్‌తోపాటు అగ్రశ్రేణి నాయకత్వం ప్రచార రంగంలోకి దిగింది. ఆయా నియోజకవర్గాలల్లో ఎమ్మెల్యేల, పార్టీ ఇన్‌చార్జీలు ప్రచార బాధ్యతలను భుజాన ఎత్తుకున్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మద్దతుగా విస్తృతంగా ఆత్మీయ సమేళనాలు నిర్వహించారు ఆ పార్టీ కీలక నేతలు కిషన్‌రెడ్డి, కే లక్ష్మణ్. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేశ్‌రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని క్యాడర్‌లో ఉత్సాహం కలిగిం చారు.

భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల లో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగి డి సునీతామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, బక్కా జడ్సన్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. దశాబ్దకాలంగా నిరుద్యోగ యువత, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేసిన ఆయన పట్ల నిరుద్యోగ యువత ఆసక్తి చూపుతున్నారు. 

పోలింగ్ ఏర్పాట్లలో యంత్రాంగం

యాదాద్రి భువనగిరి జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్ ఏర్పాట్లలో తలమునకలైంది. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ జండగే సిబ్బందిని సమాయాత్తం చేస్తున్నారు. జిల్లాలోని 17 మండలాల్లో 34,080 మంది పట్టభద్రులు ఉన్నారు. వీరిలో 13,242 మంది మహిళలు, 20,838 మంది పురుషులు ఉన్నారు.